
యాక్సిస్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సిందే
అరసవల్లి: రాష్ట్ర ప్రభుత్వం యాక్సిస్‌తో చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని వామపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల అదనుపు భారం, యాక్సిస్ ఒప్పందాల రద్దు కోరుతూ శుక్రవారం విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ యూనిట్ విద్యుత్‌ను రూ.4.60 చొప్పున కొనుగోలు చేసుకునేందుకు ఏకంగా 25 ఏళ్లపాటు ఒప్పందం కుదుర్చుకోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వం ఆదానీ సంస్థలతో సోలార్ విద్యుత్ యూనిట్ ధర రూ.2.49కే కొనుగోలు ఒప్పందం చేసుకుంటే.. ఇవే అధిక రేట్లంటూ పత్రికల్లో రాయించి రాద్ధాంతం చేసిన టీడీపీ.. ఇప్పుడు అఽధికారంలోకి వచ్చాక అంతకు రెట్టింపు డబ్బులు పెట్టి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. తాజా యాక్సిప్ ఒప్పందం ద్వారా రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.15 వేల కోట్ల భారం పడనుందని, తక్షణమే ఈ దొంగ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యుత్ చార్జీలను పెంచకుండా తగ్గిస్తామని గద్దె నెక్కిన చంద్రబాబు ఇప్పుడు ఏడాదిలోనే మూడు సార్లు విద్యుత్ చార్జీలను పెంచేసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ట్రూ అప్ చార్జీలు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, సర్‌చార్జీల పేరిట విద్యుత్ వినియోగదారులపై బాదుడే బాదుడు అంటే ఏంటో చూపించారని విమర్శించారు. దేశంలో అనేక రాష్ట్రాలు రూ.2, రూ.2.50కే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటుంటే మన రాష్ట్రంలో మాత్రం రూ.4.60కి కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటున్నారంటే.. అక్రమాలకు తెరతీసినట్లుగా ప్రజలు భావిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పి.తేజేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్ అమ్మన్నాయుడు, వివిధ సంఘాల నేతలు ఎం.ఆదినారాయణమూర్తి, కొత్తకోట అప్పారావు, అల్లు సత్యన్నారాయణ, కె.సూరయ్య, ఎన్.వి.రమణ, ఆర్.ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.