
సెల్‌ఫోన్ చోరీకి యత్నం
టెక్కలి రూరల్: స్థానిక రెడ్‌క్రాస్ వీధి సమీపంలో శుక్రవారం ఒక ద్విచక్ర వాహనంపై గుర్తు తెలియని ఇద్దరు యువకులు వచ్చి ఒక్కసారిగా కింద పడిపోయినట్లు నటించారు. అక్కడే ఉన్న పండిత శ్రీను అనే వ్యక్తి వారిని పైకి లేపేందుకు ప్రయత్నిస్తుండగా ఆ ద్విచక్ర వాహనం వెనుకనున్న వ్యక్తి అతని షర్ట్‌జేబు నుంచి సెల్‌ఫోన్ చోరీకి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన శ్రీను వారి చేతి నుంచి సెల్ తీసుకున్నాడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై అక్కడ నుంచి పరారయ్యారు. ఇది గుర్తించి మరో వ్యక్తి వారిని వెంబడించాడు. స్థానిక ఇందిరాగాంధీ జంక్షన్ వద్ద ట్రాఫిక్‌లో వారిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో ఆ ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనం అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ తరహాలో అనేకసార్లు చోరీలు జరగడంతో ఆ చోరీలతో ఈ యువకులకు సంబంధంపై పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగం తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోందని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సంఘ జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్మోహన్ అధ్యక్షతన ధర్నా శిబిరాన్ని ప్రారంభించారు. పాఠశాలలకు సంబంధించి పాత విధానాన్నే కొనసాగించాలన్నారు.ఉపాధ్యాయుల, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 55 ప్రకారం పోస్టులు కొనసాగించాలని కోరారు. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి డి.సరస్వతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వి.అనిల్‌కుమార్, జిల్లా కార్యదర్శి దాసరి రామ్మోహనరావు, జిల్లా కార్యదర్శి వి.నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.