ఇంటర్‌ సప్లిమెంటరీ హాల్‌టికెట్ల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సప్లిమెంటరీ హాల్‌టికెట్ల పంపిణీ

May 10 2025 2:12 PM | Updated on May 10 2025 2:12 PM

ఇంటర్

ఇంటర్‌ సప్లిమెంటరీ హాల్‌టికెట్ల పంపిణీ

శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు కళాశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. ఐపీఈ మార్చి పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులతోపాటు వివిధ సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు బెటర్‌మెంట్‌ రాసుకునేందుకు ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 56 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఫస్టియర్‌కు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు సెకెండియర్‌ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. బీఐఈ.ఏపీ.జీవోవి.ఇన్‌ వెబ్‌పోర్టల్‌ నుంచి కూడా విద్యార్థులు నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఇంటర్మీడియెట్‌ బోర్డు అధికారులు సూచిస్తున్నారు.

ఏపీఎస్‌పీ కమాండెంట్‌గా పద్మనాభరాజు

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఎచ్చెర్లలో ప్రారంభించిన 1వ ఏపీఎస్‌పీ (ఐఆర్‌) నూతన కమాండెంట్‌గా పద్మనాభరాజును నియమిస్తూ పోలీస్‌ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తు నిర్వహణ, తీవ్రవాద నిర్మూలన, అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్ట వంటి చర్యల్లో సివిల్‌ పోలీసులకు సహాయం చేయటం, సలహాలు ఇచ్చేందుకు ఉద్యోగోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ఎచ్చెర్ల ప్రాంతంలో బెటాలియన్‌ నిర్మాణం ఏర్పాట్లు సైతం పర్యవేక్షిస్తున్నారు. అడిషనల్‌ కమాండెంటెంట్‌ పి.సత్తిబాబు, అధికారులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.

దరఖాస్తుల ఆహ్వానం

శ్రీకాకుళం అర్బన్‌: ఏపీఎస్‌ ఆర్టీసీ డ్రైవింగ్‌ స్కూల్‌ 21వ బ్యాచ్‌కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి ఎ.విజయ్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగిన వారు అర్హులని తెలిపారు. ఈ నెల 3వ వారంలో ప్రారంభమయ్యే శిక్షణకు 16 మందికే అవకాశం ఉందని, పూర్తి వివరాలకు 9441161051, 9390886033 నంబర్లను సంప్రదించాలని కోరారు.

అనుమానితులతో జాగ్రత్త

గార : సముద్రం, తీర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానితులు సంచరిస్తే వెంటనే సమాచారమివ్వాలని కళింగపట్నం మైరెన్‌ సీఐ బి.ప్రసాదరావు కోరారు. శుక్రవారం గార మండలం బందరువానిపేట, కె.మత్స్యలేశం గ్రామాల్లో భారత్‌–పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో మత్స్యకారులకు అవగాహన కల్పించారు. సముద్రంలో వేట సాగిస్తున్నప్పుడు వేరే దేశాల బోట్లు వస్తుంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజాభద్రతకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై మహాలక్ష్మీ, సిబ్బంది పాల్గొన్నారు.

బాధితులకు న్యాయం చేయాలి

కాశీబుగ్గ: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలకు ప్రాధాన్యమిచ్చి చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌లో పోలీసు గ్రీవెన్స్‌సెల్‌ నిర్వహించారు. పలువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. విచారణ చేపట్టి పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశీబుగ్గ సబ్‌ డివిజన్‌ పరిధిలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ  హాల్‌టికెట్ల పంపిణీ   1
1/1

ఇంటర్‌ సప్లిమెంటరీ హాల్‌టికెట్ల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement