
అరసవల్లిలో వైశాఖ సందడి
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో వైశాఖ మాసం సందడి మొదలైంది. పవిత్ర వైశాఖ మొదటి ఆదివారం కావడంతో స్థానికులతో పాటు ఇతర జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతరాలయంలో ప్రత్యేక అలంకరణలో ఆదిత్యుడు సర్వదర్శనాలకు అనుమతించేలా ఆలయ అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో తగు చర్యలు చేపట్టారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కేశఖండన శాలలో తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకోగా మరికొందరు భక్తులు ఆరోగ్యం కోసం సూర్యనమస్కార పూజలు చేయించుకున్నారు. ఇంద్ర పుష్కరిణిలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై సంప్రదాయ పూజలు ఆశ్రయించారు. పంటల తొలిఫలాలను స్వామివారికి ప్రత్యేక ప్రసాదంగా నివేదించారు. పుష్కరిణి ప్రాంతంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ ఈవో కె.శోభారాణి ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేసినప్పటికీ కేశఖండనశాల, ఉచిత దర్శనాల క్యూలైన్లు తదితర చోట్ల భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది.
ఒక్క రోజు ఆదాయం రూ.10.38లక్షలు..
వైశాఖ మొదటి ఆదివారం సందర్భంగా ఒక్కరోజులో రూ.10,38,252 ఆదాయం లభించిందని ఆలయ ఈవో కె.శోభారాణి ప్రకటించారు. వివిధ దర్శన టికెట్ల విక్రయాల ద్వారా రూ.7.36 లక్షలు, విరాళాలు, పూజలు ద్వారా రూ.98,252, లడ్డూ, పులిహోర విక్రయాల ద్వారా రూ.2.04 లక్షల వరకూ ఆదాయం లభించినట్లు వివరించారు.
ట్రాఫిక్‌జామ్..
అరసవల్లి ప్రధాన రహదారిపై ఆదివారం ఉదయం ట్రాఫిక్ స్తంభించింది. గార, శ్రీకాకుళం నుంచి వాహనాల రాకపోకలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో సుమారు గంట సేపు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అనంతరం అసిరితల్లి ఆలయం పక్క నుంచి దేవాలయ తోట వరకూ వాహనాలను దారి మళ్లించారు.

అరసవల్లిలో వైశాఖ సందడి