
ఏడిపింఛెన్
● కక్షగట్టి..
● పండుటాకులపై కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ కక్షసాధింపు
● అకారణంగా పింఛన్ల పంపిణీ నిలిపివేత
● కమలనాభపురం,
కోటపాడులో బాధితుల
ఆవేదన
టెక్కలి/సంతబొమ్మాళి: వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు వర్తింపజేసేవారు. కూటమి ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తమకు ఓటు వేయని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఎటువంటి కారణాలు చూపకుండానే పింఛన్ల పంపిణీ అడ్డుకుంటోంది. తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం మాసాహెబ్‌పేట పంచాయతీ కమలనాభపురంలో ఎనిమిది మంది వృద్ధులకు పింఛన్ల పంపిణీ నిలిపివేసింది. గ్రామానికి చెందిన దువ్వారపు అప్పన్న, కర్రి లక్ష్మణ, రోణంకి సింహాచలం, గురువెల్లి గోపాలరావు, కూన సుగ్రీవులు, మొజ్జాడ సూర్యనారాయణ, బొడ్డేపల్లి ధర్మారావు, నెయ్యిల లక్ష్మీనారాయణ అనే ఎనిమిది మంది వృద్ధులకు ఎటువంటి కారణాలు చూపకుండా రెండు నెలలుగా పింఛన్ల పంపిణీ ఆపేశారు.
క్యాన్సర్ బాధితురాలిపై పగ..
సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామానికి చెందిన క్యాన్సర్ బాధితురాలు లింగుడు ఏకాశి అనే వృద్ధురాలికి ఓఏపీ కోటాలో పింఛన్ అందుతోంది. అయితే తన భర్త రామోజీకి మాజీ సైనిక ఉద్యోగి పేరిట పింఛన్ అందుతోందంటూ మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు చాట్ల అప్పలస్వామి అధికారులకు ఫిర్యాదు చేయడంతో పింఛన్ ఆపేశారని బాధితురాలు గురువారం వాపోయింది. 1987లో తన భర్త స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారని, రూ.10 వేలు లోపు మాత్రమే పింఛను అందేదని, అధికారులకు లిఖిత పూర్వకంగా గత నెలలోనే సమాధానం చెప్పామని, దీంతో ఎంపీడీవో జయంతిప్రసాద్ ఫిబ్రవరి, మార్చి నెలల పింఛన్‌ను ఒకేసారి గత నెలలో ఇచ్చారని పేర్కొంది. ఇప్పుడు రాజకీయ కక్షతో ఎటువంటి నోటీసు ఇవ్వకుండా మే నెల పింఛన్ ఆపేశారని వాపోయింది. తన భర్త ఇటీవలే చనిపోయారని, ఈ పరిస్థితిలో పింఛన్ కూడా ఆపేయడం తగదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై ఈవోపీఆర్‌డీ పద్మజ వద్ద ప్రస్తావించగా, ప్రభుత్వం నుంచి పింఛను ఇస్తున్నారని ఫిర్యాదు రావడంతో నిలుపుదల చేసినట్లు తెలిపారు.

ఏడిపింఛెన్

ఏడిపింఛెన్