
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
రణస్థలం: రణస్థలం మండల కేంద్రంలోని దన్నానపేట సమీపంలో సోమవారం రాత్రి మూడు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరావుపేటకు చెందిన అమరాపు బ్రహ్మాజీరావు రణస్థలం నుంచి స్వగ్రామం బైక్‌పై వెళ్తుండగా, అతనే పక్కనే మరో ద్విచక్ర వాహనం ఎదురుగా రాంగ్ రూట్‌లో వచ్చిన మరో ఒక ద్విచక్రవాహనం పరస్పరం ఢీకొట్టుకున్నాయి. మూడు బైకులు కింద పడటంతో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రణస్థలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. బ్రహ్మజీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జె.ఆర్.పురం ఏఎస్‌ఐ సీహెచ్ లక్ష్మణరావు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి బండిపాలెం వద్ద సగం వేసి వదిలేసిన రోడ్డే కారణమంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
పెళ్లింట విషాదం
సరుబుజ్జిలి: మండలంలోని మూల సవలాపురం గ్రామానికి చెందిన గుడాల అప్పారావు(57) సోమవారం రాత్రి కొత్తకోట జంక్షన్ వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఇతని కుమారుడి వివాహం మే 13న నిశ్చయించారు. భార్య కుమారితో కలిసి పెళ్లి కార్డులు పంచేందుకు వెళ్లి ఏబీ రోడ్డులో స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడి భార్య కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ జనార్దనరావు తెలిపారు.
వీఆర్‌కు గార ఎస్‌ఐ
గార : గార పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ రెళ్ల జనార్దనరావును శాఖాపరమైన చర్యల్లో భాగంగా శ్రీకాకుళం వీఆర్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గార ఇన్‌చార్జి ఎస్‌ఐగా శ్రీకాకుళం ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం.హరికృష్ణకు బాధ్యతలు అప్పగిస్తారని విశ్వసనీయ సమాచారం.