
వలస కూలీ అనుమానాస్పద మృతి
టెక్కలి రూరల్: టెక్కలి మండలం అక్కవరం గ్రామానికి చెందిన నెయ్యిల జోగారావు(45) అనే వలస కూలీ విశాఖపట్నం జిల్లా ఆనందపురంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగారావు జీవనోపాధి కోసం ఇటీవల ఆనందపురంలోని రైస్ మిల్లులో డ్రైవర్‌గా జాయినయ్యాడు. రెండు రోజుల క్రితం మిల్లు నిర్వాహకులు ఫోన్ చేసి జోగారావు నిత్యం మందు తాగుతున్నాడని, పనికి సైతం సరిగా రావడం లేదని భార్యకు విషయం తెలియజేశారు. ఇంతలో సోమవారం ఉదయం టాటా మ్యాజిక్ వ్యాన్‌లో ఐదుగురు కలాసీలు జోగారావు మృతదేహాన్ని తీసుకొచ్చారు. దీంతో భార్య, గ్రామస్తులు నిర్ఘాంతపోయారు. మృతిపై తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ఇలా ఇంటికి తీసుకురావడం వెనుక ఏదో కుట్ర ఉందంటూ టెక్కలి పోలీసులను ఆశ్రయించారు. అయితే ముందుగా పోలీసులు తమకు సంబంధం లేదని, ఏదైనా ఉంటే విశాఖ పోలీసులతో మాట్లాడుకోవాలని చెప్పారు. చివరకు జీరో ఎప్‌ఐఆర్ వేసి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. జోగారావుకు భార్య నీలవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు.

వలస కూలీ అనుమానాస్పద మృతి