
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ నవీన్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఈ నెల 27 నుంచి మొదలుకానున్న కుల గణన సర్వే సాఫీగా జరిగేలా అధికార యంత్రాంగం సర్వ సన్నద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు శనివారం సాయంత్రం శిక్షణ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. సర్వే కోసం రూపొందించిన ప్రత్యేక యాప్‌లో పొందుపరచిన పలు అంశాలు, వాటిని వినియోగించే పద్ధతులపై సుదీర్ఘ చర్చ జరిపారు. సర్వే సెక్షన్ ఏ, సెక్షన్ బి అనే రెండు దశల్లో జరుగుతుందన్నారు. ఎన్యూమరేటర్లుగా గ్రామ/ వార్డు స చివాలయం సిబ్బంది, వలంటీర్లు వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కులానికి సంబంధించిన సేకరించే సమాచార డేటాలో గోప్యత పాటించాలని, స్క్రీన్ షాట్‌లు తీయడం, స్క్రీన్ రికార్డింగ్‌లు చేయడం పూర్తిగా నిషేధం అనే సంగతి గుర్తించాలని స్పష్టం చేశారు. మండల స్థాయిలో జరిగే శిక్షణకు సచివాలయానికి ఇద్దరు చొప్పున ఉద్యోగులు తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు. తర్వాత దశలో వీరు వారి సచివాలయంలోని మిగిలిన సిబ్బందికి, వలంటీర్లకు శిక్షణ ఇస్తారని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.గణపతి రావు, జిల్లా పరిషత్ సీఈఓ అర్. వెంకట్రామన్, డీఆర్‌డీఏ పీడీ విద్యాసాగర్, మెప్మా పీడీ కిరణ్ కుమార్, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు, ముఖ్య ప్రణాళిక అధికారి వి.ఎస్.ఎస్ లక్ష్మీప్రసన్న, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అనురాధ, మాస్టర్ ట్రైనీ వి. మహేష్ తదితరులు పాల్గొన్నారు.