ఆచార్య సచ్చిదానందమూర్తి జీవితం స్ఫూర్తిదాయకం
● ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు
ఎచ్చెర్ల: ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి ఇచ్చిన సందేశాలు, చేసిన రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. ‘ద రోల్ ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ (ఐకేసీ) ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ రెలిజియన్ పెర్సిపెక్టివ్ ఆఫ్ కె.ఎస్ మూర్తి’ అనే అంశంపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సెమినార్ గురువారం ప్రారంభించారు. క్యాంపస్‌లోని ప్రధాన పరిపాలనా భవనంలో కొత్త సచ్చిదానందమూర్తి అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రా రంభ సమావేశానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరై ప్రసంగించారు. 2020 నూతన విద్యా కార్యక్రమంలో పొందుపరిచిన జాతీయ విజ్ఞాన వ్యవస్థ విశిష్టత గురించి ఆచార్య సచ్చిదానందమూర్తి దశాబ్దాల క్రితమే ప్రస్తావించారని అన్నారు. వైస్ చాన్స్‌లర్, చాన్స్‌లర్, యూజీసీ వైస్ చైర్మన్, ప్రపంచ ఫిలసాఫికల్ సొసైటీ ఉపాధ్యక్షునిగా సేవలందించి పరిపాలనాదక్షునిగా కూడా పేరు గడించారని తెలిపారు.
విశిష్ట అతిథిగా పాల్గొన్న విశ్వహిందీ పరిషత్ జాతీ య అధ్యక్షులు, రాజ్యసభ పూర్వ సభ్యులు అచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ అధ్యాపకుడు, విద్యార్థి మధ్య సత్యాన్వేషణ బంధం ఉండాలని ఆచార్య సచ్చిదానందమూర్తి పదేపదే ప్రస్తావించేవారన్నారు. దలైలామా, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు తదితరులతో సన్నిహితంగా మెలిగిన సచ్చిదానందమూర్తి వారసత్వాన్ని బీఆర్‌ఏయూ అందుకోవడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఇండియన్ ఫిలసాఫికల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆచార్య ఎస్. పన్నీర్‌సెల్వం (మద్రాస్ యూనివర్సిటీ) కీలక ఉపన్యాసం చేస్తూ తత్వశాస్త్ర అధ్యయనాల్లో ఆచార్య సచ్చిదానందమూర్తి ప్రపంచ మేధావిగా ఖ్యాతిగాంచారన్నారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన బీఆర్‌ఏయూ వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజనీ మాట్లాడుతూ ఇండియన్ ఫిలసాఫికల్ కాంగ్రెస్ శత వసంతాలు, ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి ముగింపు కార్యక్రమాలు పురస్కరించుకొని ఈ జాతీయ సెమినార్ నిర్వహించినట్లు తెలిపారు. ఆచార్య కొత్త సచ్చిదానంద అధ్యయన కేంద్రం బీఆర్‌ఏయూలో ఏర్పాటు చేసి అక్షరాలు నేర్పిన గురువు రుణం తీర్చుకున్నానని తెలిపారు. అనంతరం ప్రత్యేక సంకలనం ఆవిష్కరించారు.


