ఇక డిజిటల్ విధానంలో పింఛన్ ప్రయోజనాలు
● పెన్షన్ ఆదాలత్‌లో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతి ప్రియ
అరసవల్లి: ప్రభుత్వ శాఖల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ఇకపై మరింత సరళంగా పింఛను ప్రయోజనాలు అందేలా డిజిటలైజేషన్ ద్వారా కొత్త విధానాలు అమల్లోకి తెచ్చినట్లుగా ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతిప్రియ ప్రకటించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన పెన్షన్ అదాలత్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై పింఛన్‌దారులకు అందనున్న ఆన్‌లైన్ సేవలను వివరించారు. అలాగే అదాలత్‌లో పలువురు పింఛనర్ల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్‌బీపీఎస్ అనే విధానం ద్వారా పింఛనర్లకు పదవీ విరమణ చేసిన 30 రోజుల్లోనే అన్ని ఆర్థిక బెనిఫిట్స్ అందించాలని సిటిజన్ ఛార్టర్ ప్రిపేర్ చేశారని, అయితే మన రాష్ట్రంలో ఈ బెనిఫిట్స్‌ను 20 రోజుల్లో అందించేలా చర్యలు చేపడతామని ప్రకటించారు. పెన్షన్, జిపిఎఫ్ సర్వీసుల కోసం కొత్తగా ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చామని, దీని ద్వారా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగి తన సీఎఫ్‌ఎంఎస్ ఐడీ ద్వారా పూర్తి డాక్యుమెంటేషన్‌ను ఇక మీదట ఆన్‌లైన్‌లో స్వయంగా అప్‌లోడ్ చేసేలా వ్యవస్థ పనిచేస్తుందని వివరించారు. డీడీఓ స్థాయిలో సమస్య లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించి మండలస్థాయిలో ఇలాంటి అదాలత్‌ను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఆన్‌లైన్ పోర్టల్‌కు చెందిన పోస్టర్లను ఆమె మిగిలిన అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఏపీ ఎన్‌జీఓ సంఘ ప్రతినిధులు హనుమంతు సాయిరాం బృందం శాంతిప్రియను మర్యాదపూర్వకంగా కలిశారు.


