శ్రీకాకుళం పాతబస్టాండ్: పద్దెనిమిదేళ్లు నిండిన వారిని ఓటర్లుగా చేర్పించాలని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ పిలుపునిచ్చారు. డిగ్రీ, పీజీ కళాశాలల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి నూతన ఓటర్ల నమోదు కార్యక్రమం చురుగ్గా జరిగేలా చూ డాలని పేర్కొన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల తర్వాత జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తులపై జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌తో కలిసి ఆర్డీఓలు, తహసీల్దార్లతో ఆయన శుక్రవారం సమీక్షించారు. తుది ఓటర్ల జాబితా వచ్చే ఏడాది జనవరి 5న ప్రచురిస్తామని అప్పటికి ఓటర్ల జాబితా పూర్తి స్థాయిలో మదింపు జరగాలని తెలిపారు. బూత్ లెవెల్ అధికారులతో తహసీల్దార్లు ఎప్పటికప్పుడు ముఖాముఖి సమావేశాలు నిర్వహించడం ద్వా రానే అది సాధ్యమవుతుందని తెలిపారు. డిసెంబర్ 2, 3 తేదీల్లో మరోసారి బూత్ లెవెల్ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి గనుక ఇప్పటినుంచే అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించుకోవాలని వివరించారు. 2024 ఎన్నికల నిర్వహణకు జిల్లాలో 288 సెక్టోరియల్ అధికారుల నియామకాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. అదే స్థాయిలో పోలీసు అధికారుల నియామకం త్వరలో పూర్తవుతుందన్నారు. ఓట్ల తొలగింపు సమయంలో బూత్ లెవెల్ ఏజెంట్ల సంతకాలు తప్పని సరిగా తీసుకోవాలని సూచించారు.