
మృతుడు జాన నరసింహులు (ఫైల్)
భోగాపురం: మండలంలోని సుందరపేట జాతీయ రహదారిపై వ్యాన్ బోల్తాపడి శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలానికి చెందిన చేపల వ్యాపారి జాన నరసింహులు(32) మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నరసింహులు చేప ల వ్యాపారం చేసుకుంటూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో విశాఖపట్నంలో చేపలు కొనుగోలు చేసుకుని వ్యాన్‌లో శ్రీకాకుళం వెళ్తుండగా వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నరసింహులు కింద పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని సుందరపేట సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచనల మేరకు తగరపువలస ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య నీలవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపారు.