
లడ్డూ వేలంలో పాల్గొన్న గ్రామ ప్రజలు
● తిప్పనపుట్టుగలో ఆదర్శంగా
వినాయక చవితి
● ఐదున్నర దశాబ్దాలుగా
ఒకే మండపం ఏర్పాటు
● కొబ్బరి, అరటి గెలలతో అలంకరణ
ఇచ్ఛాపురం రూరల్: ఉదయం భక్తి పాటలు, రాత్రి సినిమా పాటల వింత ప్రవర్తన ఉండదు. దేవుడి ముందు డీజేల గోలలు, అశ్లీల నృత్యాల అకృత్యాలు కనిపించవు. పండుగ అలంకరణలో దర్పమన్నది ఉండదు. ఐదున్నర దశాబ్దాలుగా వినాయక చవితి వేడుకను అత్యంత భక్తిశ్రద్ధలతో.. అదీ ఒకటే మండపంలో ఊరంతా జరుపుకుంటున్నారు. ఆ ఊరి పేరు ఇచ్ఛాపురం మండలం తిప్పనపుట్టుగ.
రెండు మండలాలకు ఒకే గ్రామం
ఇచ్ఛాపురం, కవిటి మండలాలకు చెందిన గ్రా మం తిప్పనపుట్టుగ. పేరుకే రెండు మండలాల గ్రామస్తులు. గ్రామం ఒక్కటే కావడంతో అందరూ కలసి కట్టుగా కార్యక్రమాలు చేస్తూ తమలో ఐక్యతను చాటుకుంటుంటారు. సుమారు వెయ్యికి పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో 55 ఏళ్ల కిందట పెద్దలు నిర్ణయించిన విధంగానే స్థానిక బస్టాండ్ మర్రిచెట్టు కింద వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. కులమతాలకు అతీతంగా రెండు మండలాలకు చెందిన వారందరూ కలసి ఈ విగ్రహం వద్దే పూజలు ని ర్వహిస్తారు. మండపం వద్ద డీజేలు, నృత్యాలు కాకుండా సామూహిక కుంకుమ పూజలు, భజనలు, కబడ్డీ పోటీలు, కోలాటాలు, రేలారేలా జానపద నృత్యాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు వారం రోజుల పాటు నిర్వహిస్తుంటారు.
కొబ్బరి, అరటి గెలలతో..
ఈ గ్రామానికి చెందిన రైతులు వినాయక చవితి ఉత్సవానికి బహుమతిగా ప్రతి ఒక్క కొబ్బరి రైతు ఒక కొబ్బరి గెలను, తమ తోటల్లో పండించే అరటి గెలను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. వీటిని గ్రామం పొడుగునా ప్రదర్శించడం ఇక్కడ ప్రత్యేకత. విగ్రహం నిమజ్జనం అనంతరం కొబ్బ రి కాయలు, అరటి గెలతో పాటు లడ్డూను వేలం వేయడం, వచ్చిన మొత్తంతో అన్నదానం, వచ్చే ఏడాది చవితి ఉత్సవాలకు వినియోగిస్తున్నట్లు గ్రామ పెద్దలు చెబుతున్నారు.
ఆనవాయితీ కొనసాగిస్తున్నాం
అంతా కలసిమెలసి ఉండాలన్న ఉద్దేశంతో 55 ఏళ్ల కిందట గ్రామ పెద్దలు గ్రామంలో ఒకే వినాయక విగ్రహం ఉండాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నాం. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నాం.
– రత్నాల తారకేశ్వరరావు,
నిర్వాహక కమిటీ సభ్యుడు, తిప్పనపుట్టుగ

ఉత్సవంలో గ్రామం పొడుగునా ఏర్పాటు చేసిన కొబ్బరి, అరటి గెలలు

గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం
