
జెండా ఊపి బస్సును ప్రారంభిస్తున్న జిల్లా ప్రజారవాణా అధికారి విజయ్‌కుమార్
శ్రీకాకుళం అర్బన్: వేసవి సెలవుల సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ నడుపుతున్న ప్రత్యేక సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజారవాణా అధికారి ఎ.విజయ్‌కుమార్ కోరారు. శ్రీకాకుళం ఆర్టీసీ బస్‌స్టేషన్ నుంచి అరుణాచల గిరి ప్రదక్షిణ విహారయాత్రకు బయలుదేరిన సూపర్ లగ్జరీ ప్రత్యేక సర్వీసును శుక్రవారం జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు రోజుల యాత్రలో భాగంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్ దర్శనం తదనంతరం అరుణాచల గిరిప్రదక్షిణ చేసుకొని తిరుగు ప్రయాణంలో కంచి, శ్రీకాళహస్తి ఆలయాల దర్శనం ఉంటుందని చెప్పారు. మంగళవారం ఉదయం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు బస్సు చేరుకుంటుందన్నారు. ప్రయాణ చార్జి రూ.4500 వసూలు చేస్తున్నట్లు తెలిపారు. జూలై 1, జూలై 30వ తేదీల్లోనూ ఈ ప్రత్యేక సర్వీసులు అరుణాచలానికి బయలుదేరుతాయని చెప్పారు. జిల్లావాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆన్‌లైన్‌లో ఏపీఎస్‌ఆర్‌టీసీఆన్‌లైన్.ఇన్ వెబ్‌ౖసైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటో డిపో మేనేజర్ కె.మాధవ్, అసిస్టెంట్ మేనేజర్ వి.రమేష్, ఎస్‌ఎం సన్యాసిరావు, టీఐ–3 ఎల్‌ఎస్ నాయుడు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.