టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

Jun 3 2023 1:26 AM | Updated on Jun 3 2023 1:26 AM

- - Sakshi

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాల్లో జరుగుతున్న ఈ పరీక్షలకు తొలిరోజు ఫస్ట్‌లాంగ్వేజ్‌ (తెలుగు)కు 1299 మందికి గాను 331 మంది గైర్హాజరయ్యారు. అధికారులు, తనిఖీ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డీఈఓ ఎస్‌.తిరుమల చైతన్య, ఉపవిద్యాశాఖాధికారులు పర్యవేక్షించారు.

జిల్లా పోలీసు కార్యాలయ ఏఓగా గోపీనాథ్‌

శ్రీకాకుళం క్రైమ్‌ : శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయ పరిపాలనాధికారి (ఏఓ)గా సీహెచ్‌.గోపీనాథ్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే బదిలీపై వెళ్లిన ఎం.శివరామరాజు స్థానంలో ఈయన వచ్చారు. అనంతరం ఎస్పీ జి.ఆర్‌.రాధికను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈయన ఏలూరు పోలీసు కార్యాలయంలో పనిచేసి సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడికి చేరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ జె.తిప్పేస్వామి పాల్గొన్నారు.

జిల్లా ఉపాధి కల్పనాధికారిగా సుధ

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా ఉపాధి కల్పనాధికారిగా కె.సుధ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె విశాఖపట్నంలోని జిల్లా సాంకేతిక కల్పన కార్యాలయం నుంచి బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు జిల్లా ఉపాధి అధికారిగా పనిచేసిన జి.శ్రీనివాసరావు కాకినాడ జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా సుధకు జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

పాలిసెట్‌ ధ్రువీకరణ పత్రాల పరిశీలన

ఎచ్చెర్ల క్యాంపస్‌: పాలిటెక్నిక్‌ డిప్లమా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ పాలిసెట్‌ – 2023 కౌన్సెలింగ్‌ కొనసాగుతోంది. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలోని సహాయ కేంద్రంలో పాలిసెట్‌ ర్యాంకర్లు దరఖాస్తులు పరిశీలిస్తున్నారు. సహాయ కేంద్రంలో శుక్రవారం 58001 నుంచి 74000 మధ్య ర్యాంకు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. 308 మంది విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్‌ మేరకు శనివారం 74001 నుంచి 91000 మధ్య ర్యాంకు విద్యార్థుల పత్రాలు పరిశీలించనున్నారు. రీషెడ్యూల్‌ మేరకు శనివారం నుంచి ఆప్షన్ల ఎంపిక ప్రారంభం కానుంది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఈ నెల ఐదు వరకు కొనసాగనుంది. కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రిన్సిపాల్‌ జి.దామోదర్‌రావు, ఇన్‌చార్జి మురళీకృష్ణ పర్యవేక్షిస్తున్నారు.

ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోండి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో 2010 నుంచి 2018 మధ్య, తర్వాత ఆధార్‌ కార్డు పొందినవారు ప్రతి పదేళ్లకోసారి తప్పనిసరిగా నవీకరణ (అప్‌డేట్‌) చేసుకోవాలని ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి మురళీకృష్ణ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఆధార్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్ల లోపు వయసున్న వారి ఆధార్‌ నమోదు, అప్‌డేట్‌ వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. శిశువులు ఆధార్‌ పొందేలా ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆధార్‌ ప్రక్రియ పూర్తికి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. 15 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్‌ అప్‌డేట్‌ ఉచితంగా రెండుసార్లు చేయవచ్చని, విద్యా సంస్థలతో సమన్వయం చేసుకుని కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. పూర్తి వివరాలకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1947ను సంప్రదించవచ్చన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ తిప్పేస్వామి, డీఆర్‌డీఏ, పీడీ విద్యాసాగర్‌, గ్రామ వార్డు సచివాలయం ప్రత్యేక అధికారి వాసుదేవరావు, ఎల్‌డీఎం ఎం.సూర్యకిరణ్‌, అర్బన్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జంపు కృష్ణమోహన్‌. తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీకి పుష్పగుచ్ఛం అందజేస్తున్న గోపీనాథ్‌ 
1
1/2

ఎస్పీకి పుష్పగుచ్ఛం అందజేస్తున్న గోపీనాథ్‌

కె.సుధ 2
2/2

కె.సుధ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement