
లింగరాజు సత్యసేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు
హిరమండలం: పాతపట్నంలో ఈ నెల 4న సత్యసాయి సేవా సమితి జిల్లాస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు వై.లింగరాజు మాస్టర్ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రేమ సాయి వృద్ధాశ్రమాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు జరిగే సమావేశానికి జిల్లాలోని అన్ని సత్యసేవా సమితుల కన్వీనర్లు, భజన మండలి కన్వీనర్లు, జోనల్ కన్వీనర్లు, జిల్లా పదాధిపతులు, కోఆర్డినేటర్లు, క్రియాశీలక సభ్యులు విధిగా హాజరుకావాలన్నారు. ఆధ్యాత్మిక, విద్యా సేవ, యువజన విభాగాల సేవలతో పాటు ఆగస్టులో నిర్వహించనున్న 20వ పర్తి యాత్రపై చర్చిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆశ్రమ కోఆర్డినేటర్ ఎస్.సాయిబాబా, అభివృద్ధి కమిటీ సభ్యులు జ్యోషు గోవిందశర్మ, చంటి మాస్టర్ పాల్గొన్నారు.
గిరిజనుడి నిజాయితీ
కాశీబుగ్గ: కాశీబుగ్గలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అదనంగా రూ.20 వేలు ఇచ్చిన క్యాషియర్‌కు తిరిగి నగదు అందజేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కొండలోగాం గ్రామానికి చెందిన సవర ఆనందరావు ఓ జీడి పరిశ్రమ యజమాని వద్ద గుమస్తాగా పనిచేస్తున్నారు. రెండు వేల రూపాయల నోట్లు మార్చడానికి బ్యాంకుకు రాగా, రూ.20 వేల నగదుకు బదులు రూ.40 వేలను క్యాషియర్ పొరపాటున ఇచ్చేశారు. గుమస్తా పరిశ్రమకు వెళ్లి చూడగా అదనంగా వచ్చిన నగదు గుర్తించారు. అనంతరం బ్యాంకు అధికారులకు నగదు అప్పగించారు. యువకుడి నిజాయితీని బ్యాంకు సిబ్బంది అభినందించారు.
మూల్యాంకన కేంద్రం పరిశీలన
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనంలో పాల్గొంటున్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆర్జేడీ శారద సూచించారు. శుక్రవారం శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జరుగుతున్న స్పాట్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. దిద్దుబాటు తీరు, మార్కుల కేటాయింపు, బబ్లింగ్ చేయడాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. మౌలిక సదుపాయాలను ఎగ్జామినర్లు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐఓ ఎస్.తవిటినాయుడు, జనరల్ 1, 2 బి.శ్యామ్‌సుందర్, కె.తవిటినాయుడు, ఏసీవోలు పాల్గొన్నారు.