రైతుకు ధీమా! | - | Sakshi
Sakshi News home page

రైతుకు ధీమా!

Jun 3 2023 1:22 AM | Updated on Jun 3 2023 1:22 AM

గొర్రెలు, మేకల మంద  - Sakshi

గొర్రెలు, మేకల మంద

పశు

బీమా..

ఎల్‌.ఎన్‌.పేట: జిల్లాలో గ్రామీణ ప్రాంత రైతులు వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమకే అధిక ప్రాధాన్యమిస్తారు. అయితే పశుపోషణ సవాళ్లతో కూడుకుంటుంది. ఈ నేపథ్యంలో జీవాల పెంపకందారులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాడి పరిశ్రమలో పాడి, దుక్కి పశువులు, గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, నాటుకోళ్లు వీటినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న రైతులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం ‘వైఎస్సార్‌ పశుబీమా పథకాన్ని’ అమల్లోకి తెచ్చింది. పలు రకాల వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదవశాత్తు, సహజ సిద్ధంగా మృతి చెందిన వాటికి బీమా చెల్లించేందుకు ప్రభుత్వం కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రీమియం చెల్లింపు ఇలా..

● తెలుపు రేషన్‌ కార్డు కలిగిన నిరుపేద రైతులు తమ వాటా కింత 20 శాతం, ఇతర రైతులు (రేషన్‌ కార్డు లేనివారు) 50 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

● దేశవాళి, సంకరజాతి పశువులకు మూడేళ్ల బీమా కాలానికి రూ.30 వేలు బీమా మొత్తం కాగా తెలుపు రేషన్‌ కార్డు లేని రైతు రూ.960, కార్డు ఉన్న రైతు రూ.384 చెల్లించాలి.

● నాటు జాతి పశువులు మూడేళ్ల బీమా కాలానికి రూ.15వేలు బీమా మొత్తం కాగా తెలుపు రేషన్‌ కార్డు లేని రైతు రూ.480, కార్డు ఉన్న రైతు రూ.192 చెల్లించాలి.

● గొర్రెలు, మేకలు, పందులకు ఏడాదికి బీమా మొత్తం రూ.6 వేలు ఉంది. తెలుపు రేషన్‌ కార్డు లేని రైతు రూ.90, కార్డు ఉన్న రైతు రూ.36లు, రెండేళ్ల కాల పరిమితికి తెలుపు రేషన్‌ కార్డు లేని రైతు రూ.135, కార్డు కార్డు ఉన్న రైతు రూ.54, మూడేళ్ల కాలపరిమితికి తెలుపు రేషన్‌ లేని రైతు రూ.187.50, కార్డు ఉన్న రైతు రూ.75 చెల్లించాలి.

జీవాలు మరణిస్తే..

పశువులు, జీవాలు ఏదైనా కారణంతో మరణిస్తే వెంటనే పశువైద్య శాఖ అధికారులకు తెలియజేయాలి. రైతు ముందుగా చెల్లించిన కాలపరిమితిని, చెల్లించిన బీమా ప్రీమియంను పరిగణనలోకి తీసుకుని పరిహారం చెల్లిస్తారు. ఆరు నెలలు, ఆపైబడిన వయసు కలిగిన జీవాలు (ఒక కుటుంబానికి 50 మాత్రమే) మరణిస్తే రూ.6వేలు చెల్లిస్తారు. దేశవాళీ పశువులకు రూ.30వేలు, నాటు పశువులకు రూ.15వేలు బీమా (ఒక కుటుంబానికి 5 పశువులకు) వస్తుంది. మరణించిన 21 రోజుల్లో బీమా మొత్తం రైతు బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ప్రభుత్వ నిబంధనలు కాకుండా పూర్తి స్థాయిలో బీమా చెయించుకుంటే పశువులకు రూ.1.20 లక్షలు, జీవాలకు రూ.15 వేలు బీమా వర్తిస్తుంది.

అవగాహన కల్పిస్తున్నాం

వైఎస్సార్‌ పశుబీమా పథకం పాడి రైతులకు మేలు చేకూర్చేలా ఉంది. పశువులు, జీవాలు మరణించిన 21 రోజుల్లోనే బీమా మొత్తం రైతు బ్యాంకు ఖాతాకు జమవుతుంది. బీమా పథకంపై రైతులకు అవగాహన కలిగిస్తున్నాం. పశువులు, జీవాలు మరణిస్తే బాధిత రైతులు గ్రామ సచివాలయంలో ఉన్న వెటర్నరీ సహాయకులు, పశువైద్య శాల డాక్టర్‌కు తెలియజేయాలి.

– ఎం.లోకనాథం, ఎ.డి. పశుసంవర్థక శాఖ, కోటబొమ్మాళి

బీమా చెల్లించా

మాకు మేకలు, గొర్రెల మంద ఉంది. బీమా చెల్లించాలని పశువుల డాక్టర్‌తో పాటు గ్రామ సచివాలయం సిబ్బంది, గోపాల మిత్రలు చెప్పారు. మేకలు, గొర్రెల మందకు బీమా చెల్లించాను. మా కోసం అధికారులు, నాయకులు ఆలోచన చేయటం గొప్ప విషయం.

– బొమ్మాళి సిమ్మన్న, గొర్రెల మంద కాపరి, కృష్ణాపురం, ఎల్‌.ఎన్‌.పేట

ఒకసారి బీమా ప్రీమియం చెల్లిస్తే మూడేళ్ల కాలపరిమితి

21 రోజుల్లోపే పరిహారం చెల్లింపు

సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు

పాడి రైతులకు అవగాహన కలిగిస్తున్న అధికారులు 1
1/4

పాడి రైతులకు అవగాహన కలిగిస్తున్న అధికారులు

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement