సాక్షి, పుట్టపర్తి: నకిలీగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ అధికారుల పేరుతో దోపిడీ చేస్తున్నారు. మోసపోయామని బాధితులు గుర్తించేలోపే ఉడాయిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల పేరుతో ఇటీవల నల్లమాడ, బుక్కపట్నం, ఓడీ చెరువు, కొత్తచెరువు, గోరంట్ల, తనకల్లు తదితర ప్రాంతాల్లో దుకాణాలలోకి దుండగులు చొరబడడం ఆందోళన కలిగిస్తోంది. వాహనాలకు నకిలీ ప్రభుత్వ స్టిక్కర్లు అతికించి, కార్డులు మెడలో వేసుకుని ఉండడంతో అమాయకులు భయపడిపోయి వారు అడిగినంత సమర్పించుకుంటున్నారు.
సైబర్.. టెర్రర్
హిందూపురం, పుట్టపర్తి, కొత్తచెరువు, ధర్మవరం, కదిరి తదితర ప్రాంతాల్లో సైబర్ మోసాలు పెరిగిపోయాయి. అమాయకులను టార్గెట్ చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ముఠాగా ఏర్పడి కొత్త మొబైల్ నంబర్ల నుంచి కాల్ చేసి మాయమాటలు చెప్పి డబ్బు లాగుతున్నట్లు తెలిసింది. ఏడాది క్రితం హిందూపురం మున్సిపల్ ఆఫీస్ నుంచి అంటూ పలువురికి కాల్స్ చేసి కరెంట్ బిల్లు, ఇంటి పన్ను, నీటి పన్ను ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తే 50 శాతం రాయితీ వస్తుందని నమ్మబలికిన మాయగాళ్లు రూ.లక్షల్లో గుంజడం గమనార్హం.
అధికారులపైనా ఆరోపణలు
కొందరు ప్రభుత్వ అధికారులు తమ పరిధిలో అక్కడక్కడా ఏజెంట్లను పెట్టుకుని నకిలీ ఐడీ కార్డులు అందజేసి వసూళ్లు చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కొందరిని ప్రశ్నించగా, తమకు సంబంధం లేదని దాటవేశారు. నకిలీ అధికారుల ఆచూకీ తెలిపితే తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.ఫుడ్ సేఫ్టీ, తూనికలు– కొలతలు, ఆదాయ పన్ను, కరెంట్ బిల్లు వసూలు, బ్యాంకుల్లో పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు ఆఫర్లు తదితర పేర్లతోనే ఎక్కువగా దందాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది.
అప్రమత్తతే శ్రీరామరక్ష
అప్రమత్తతతోనే మోసాల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. పుట్టపర్తిలో ప్రైవేటు క్లినిక్ నిర్వహిస్తున్న ఓ డాక్టర్‌కు ఇటీవల మున్సిపల్ కమిషనర్ పేరుతో ఫోన్ కాల్ వచ్చింది. పన్ను బకాయిలు చాలా ఉన్నాయని, మొదట ఎంతోకొంత అందజేస్తే మాఫీ అయ్యే అవకాశం ఉందంటూ ఫోన్ పే నంబరు కూడా చెప్పారు. అయితే డాక్టర్ తెలివిగా వ్యవహరించి మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత ఆ ఫోన్ నంబర్లన్నీ స్విచాఫ్ కావడం గమనార్హం.
పోలీసులకు సమాచారమివ్వండి
సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మొబైల్‌కు వచ్చే ఓటీపీలను తెలియని వ్యక్తులు అడిగితే చెప్పరాదు. పన్ను వసూళ్ల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌కు స్పందించాల్సిన అవసరం లేదు. నకిలీ అధికారులని ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి.
– ఎస్.సతీశ్‌కుమార్, ఎస్పీ


