ప్రశాంతినిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్‌ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రేషన్ బియ్యం పట్టివేత
హిందూపురం: చౌక దుకాణాల ద్వారా ప్రజలకు చేరాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. బ్లాక్‌లో అమ్ముకునేందుకు లారీలో తరలిస్తున్న 16 టన్నుల బియ్యాన్ని ఆదివారం పట్టుకున్నట్లు హిందూపురం రూరల్ సీఐ ఆంజనేయులు తెలిపారు. ఆయన వివరాల మేరకు... ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్నారని కచ్చితమైన సమాచారం వచ్చింది. ఈ మేరకు మణేసముద్రం గ్రామ పరిసరాల్లో ఐచర్ (ఏపీ39 టీఎన్ 3414) వాహనంలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించారు. హిందూపురం పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ హారతి సమక్షంలో 16 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 294 బస్తాల 50 కేజీల బియ్యం ప్యాకెట్లు, మరో 52 బస్తాల్లో 25 కేజీల బియ్యం ప్యాకెట్లు ఉన్నాయని సీఐ తెలిపారు. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న సోమందేపల్లికి చెందిన కొత్త ఎ.మహేష్, కె.రామకృష్ణప్పపై కేసు నమోదు చేశామన్నారు. ప్రధాన నిందితుడు రామకృష్ణప్ప పరారీలో ఉన్నాడన్నారు. బియ్యం అక్రమ రవాణాను చాకచక్యంగా అడ్డుకొని భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న సీఐ ఆంజనేయులు, పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించి రివార్డు ప్రకటించారు.
నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్
సాక్షి, పుట్టపర్తి: నకిలీ కరెన్సీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నకిలీ నోట్లు, ఒక ఇన్నోవా కారు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు హిందూపురం అప్‌గ్రేడ్ సీఐ ఆంజనేయులు, రూరల్ సీఐ జనార్దన్ బృందం హిందూపురం రూరల్ మండల పరిసరాల్లో మూడు రోజుల క్రితం నిందితులను అదుపులోకి తీసుకుంది. నిందితుల్లో చిలమత్తూరు మండల టీడీపీ నాయకుడు లక్ష్మినారాయణ యాదవ్ అనుచరులు వెంకటేష్, బాలాజీతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరచరిత్ర కలిగిన వీరు లక్ష్మినారాయణ యాదవ్ ప్రోద్బలంతో ఈ వ్యవహారం నడిపినట్టుగా జోరుగా చర్చ నడుస్తోంది.


