తూకం.. దారుణ మోసం | - | Sakshi
Sakshi News home page

తూకం.. దారుణ మోసం

May 18 2026 9:43 AM | Updated on May 18 2026 9:43 AM

జిల్లాలో వివరాలిలా..
చౌకదుకాణాలు 1,367 రేషన్‌ కార్డులు 5,76,203 లబ్ధిదారులు 17,42,136 బియ్యం 8710.86 మెట్రిక్‌ టన్నులు

కదిరి: తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యాన్ని ఎవరి స్థాయిలో వారు నొక్కేస్తున్నారు. ఎఫ్‌సీఐ గోడౌన్ల నుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు వచ్చే బియ్యం తూకాల్లో కొంత తేడా వస్తోంది. అక్కడి నుంచి డీలర్‌ దగ్గరకు వచ్చే సరికి మరికొంత తగ్గుతోంది. కార్డు లబ్ధిదారులకు ఇచ్చే తూకాలు చూస్తే మరీ దారుణంగా ఉన్నాయి. 50 కిలోల బియ్యం బస్తా అక్కడ కొంచెం.. అక్కడ కొంచెం కరిగి పోయినట్లు చివరికి చేరే సరికి ఐదారు కిలోల తేడా వస్తోంది.

అంతిమ నష్టం లబ్ధిదారులకే..

శ్రీ సత్యసాయి జిల్లాకు ప్రతి నెలా 87,10,680 కిలోల బియ్యం సరఫరా అవుతోంది. ఇందుకోసం రూ. 38.32 కోట్లు ఖర్చు అవుతోంది. ఆ బియ్యం మొదట జిల్లాలోని కదిరి, గాండ్లపెంట, తనకల్లు, ఓడీ చెరువు, ముదిగుబ్బ, గోరంట్ల, బుక్కపట్నం, ధర్మవరం, సీకే పల్లి, పెనుకొండ, హిందూపురం, మడకశిరలలో ఉన్న ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు చేరుతుంది. తర్వాత వాటి పరిధిలోని చౌక డిపోలకు సరఫరా చేస్తారు. తాను చౌకడిపోలో 50 కిలోల బస్తా తూకం వేస్తే 43.040 కిలోలు మాత్రమే వచ్చిందని ఈ తరుగు కార్డుదారులపై వేయక తప్పదని ఓ చౌకడిపో డీలర్‌ అన్నారు. కొంత మంది లబ్ధిదారులకు కొన్నిసార్లు ఎగ్గొట్టాల్సి వస్తోందని, అప్పుడు కొందరు గొడవలకు దిగిన సంఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు.

జగన్‌ హయాంలో పక్కాగా..

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో లబ్ధిదారులు రేషన్‌ దుకాణాల వద్ద క్యూలో నిల్చొనే బాధల నుంచి విముక్తి కల్గించారు. మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ)ల ద్వారా నేరుగా వారి ఇంటి వద్దకే బియ్యం సరఫరా చేశారు. వాటిలో ఎలక్ట్రానిక్‌ డిజిటల్‌ తూకపు యంత్రాలు ఉండేవి. వీటిని బిల్లింగ్‌ మిషన్లకు బ్లూటూత్‌ ద్వారా అనుసంధానం చేయడంతో లబ్ధిదారునికి పక్కాగా అందేది. బియ్యం కల్తీకి ఆస్కారం లేకుండా ప్రత్యేక మైన ప్యాకెట్లలో వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అడుగడుగునా అక్రమాలే.

రేషన్‌ దుకాణాల్లో తూకాల్లో భారీ తేడా

సరఫరాలోనే స్వాహా అంటున్న డీలర్లు

నష్టపోతున్న రేషన్‌ కార్డుదారులు

టీడీపీ నాయకులు మెక్కేస్తున్నారు

చౌక బియ్యాన్ని కొందరు టీడీపీ నాయకులు బాగా మెక్కేస్తున్నారు. తూకాల్లో మోసం చేసేవాళ్లు కొందరైతే, వేల బస్తాల బియ్యం అక్రమంగా జిల్లాలు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులకు తెలిసినా అధికార పార్టీ నాయకులను ఏమీ అనలేక పోతున్నారు.

–ఉషశ్రీ చరణ్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు

ధర్మవరం మార్కెట్‌ ఏరియాలోని ఒక చౌక డిపోలో స్థానిక మహిళ ఇటీవల 15 కిలోల బియ్యం తీసుకెళ్లింది. ఇంటికెళ్లి తూకం వేస్తే 13.25 కిలోలు మాత్రమే వచ్చాయి. మళ్లీ డీలర్‌ చెంతకు వెళ్లి అడిగింది. ఆయన అక్కడున్న ఓ 50 కిలోల బియ్యం బస్తాను దించి ఆమె కళ్ల ముందే తూకం వేశాడు. 46 కిలోలు మాత్రమే ఉన్నాయి. ‘ప్రతి 50 కిలోల బస్తాకు నాలుగైదు కిలోలు తక్కువ వస్తున్నాయి.. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి..’ అని చెప్పడంతో ఆమె మరోమాట మాట్లాడకుండా వెనుదిరిగింది. ఈ సమస్య ఽఅక్కడ మాత్రమే కాదు.. జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్లా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement