చిలమత్తూరు: మండల పరిధిలోని 44వ నెంబరు జాతీయ రహదారి కొడికొండ చెక్‌పోస్ట్ గంగోత్రి ధాబా వద్ద 7 హిల్స్ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొని మైసూరుకు చెందిన ప్రకాష్ (60) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాయచూరు నుంచి ప్రకాష్ బెంగళూరుకు బస్సులో వెళ్తున్నాడు. అయితే టీ తాగడానికి బస్సు గంగోత్రి ధాబా వద్ద ఆపారు. ప్రకాష్ రోడ్డు అవతలి వైపు మూత్ర విసర్జన కోసం వెళ్లే క్రమంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. బస్సును సీజ్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చిన్నారికి గాయాలు
రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోతగుట్ట కాలనీలో ఆడుకుంటూ ఓ చిన్నారి మిద్దైపె నుంచి పడి గాయాలపాలైన ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు... ధర్మవరం నియోజకవర్గం సీకే పల్లికి చెందిన హంపి కుమార్తె నిహారిక (8) వేసవి సెలవుల నిమిత్తం రాయదుర్గంలోని పెదనాన్న తిమ్మరాజు ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మిద్దైపె ఆడుకుంటూ కాలు జారి కింద పడింది. తలకు బలమైన గాయాలు కావడంతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంకు వైద్యులు సిఫార్సు చేశారు. ప్రస్తుతం బాలిక కోలుకుంటున్నట్లు బంధువులు తెలిపారు.


