పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి

May 17 2026 12:24 AM | Updated on May 17 2026 12:24 AM

ప్రశాంతి నిలయం: స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా అందరూ పనిచేయాలని, అందులో భాగంగా పారిశుధ్యం మెరుగునకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని వీసీ హాలు నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... స్వచ్ఛ సర్వేక్షన్‌ సర్వేలో జిల్లాను ముందంజలో నిలపడానికి నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. అలాగే అన్ని మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ, ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులందరూ సమన్వయంతో కష్టపడి పని చేయాలన్నారు.

కుమారుడికి ‘ఫీజు’ పథకం..టీచర్‌ సస్పెండ్‌

పెనుకొండ: వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో తన కుమారుడికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా లబ్ధి పొందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే...పెనుకొండ బాలికల ఉన్నత పాఠశాలలో స్వర్ణలత హిందీ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె కుమారుడు ఉన్నత విద్య చదువుతుండగా... దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు ఆధారాలు సృష్టించి ప్రభుత్వం నుంచి కుమారుడికి ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ పొందారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు అందడంతో ఇటీవల డీవైఈఓ పాఠశాలలో విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. స్వర్ణలత ఉద్దేశపూర్వకంగానే పత్రాలు సృష్టించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందినట్లు నిర్ధారణ కావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి ఆమెను సస్పెండ్‌ చేస్తూ శనివారం జారీ చేశారు. ఈ విషయమై స్థానిక బాలికల ఉన్నత పాఠశాల హెచ్‌ఎం. శ్రీలతను వివరణ కోరగా... స్వర్ణలతను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని జిల్లా విద్యాశాఖ అధికారులు ఫోన్‌ ద్వారా 3 రోజుల క్రితం తెలిపారన్నారు.

గ్యాస్‌ సిలిండర్‌ పేలి

ఇల్లు ధ్వంసం

బత్తలపల్లి: మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన కుమ్మర పట్నం రమాదేవి ఇంట్లో శనివారం రాత్రి వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఘటనతో ఇంటి పైకప్పు ధ్వంసమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. రూ.4 లక్షలు వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి గ్రామస్తులు తరిగోపుల చౌదరి, చెన్నకేశవులు తీసుకెళ్లారు. బాధితులను ఆదుకోవాలని విన్నవించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి, విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement