అనంతపురం అర్బన్: రెవెన్యూశాఖలో సీనియర్ అసిస్టెంట్లు, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు(ఆర్‌ఎస్‌డీటీలు)గా పదోన్నతి కల్పించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆర్‌ఎస్‌డీటీ పోస్టులు అనంతపురం జిల్లాలో 11, శ్రీ సత్యసాయి జిల్లాలో 5 ఖాళీగా ఉన్నాయి. వీటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించే ముందు సంబంధిత కంట్రోలింగ్ అధికారి నుంచి కేడర్‌కు సంబంధించి సర్వీస్ వివరాలతో మొత్తం సిబ్బందిని చూపిస్తూ (అర్హులు, అనర్హులు, మరణించిన, ఉద్యోగ విరమణ చేసిన వారిని) నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రకారం రెవెన్యూ శాఖలో ఉన్న మొత్తం ఎస్‌ఏలు, ఎంఆర్‌ఐలు 85 మందిని చూపిస్తూ డీఆర్‌ఓ మలోల నోటీసును జారీ చేశారు.
ఖాళీలు ఇలా...
అనంతపురం జిల్లాలో ఆర్‌ఎస్‌డీటీ పోస్టులు కళ్యాణదుర్గం, శెట్టూరు, వజ్రకరూరు, పామిడి, బొమ్మనహాళ్, గుమ్మఘట్ట, ఆత్మకూరు, అనంతపురం అర్బన్, డి.హీరేహాళ్ బ్రహ్మసముద్రం మండలాల్లో ఖాళీగా ఉన్నాయి. ఇక శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి, హిందూపురం, లేపాక్షి, రొద్దం, గోరంట్ల మండలాల్లో ఖాళీగా ఉన్నాయి.
పరిశీలనాంతరం సీనియార్టీ జాబితా..
ప్రస్తుతం జారీ చేసిన నోటీసులో చూపిన మొత్తం 85 మంది ఉద్యోగుల్లో ఇప్పటికే ఐదుగురు చనిపోగా, 11 మంది ఉద్యోగ విమరణ చేశారు. మిగిలిన 69 మందిలో ఆర్‌ఎస్‌డీటీగా పదోన్నతి పొందేందుకు అవసరమైన ఐదు పరీక్షల్లో ఉత్తీర్ణులైన 25 మందిని అర్హులుగా చూపించారు. ఇందులో 19మంది అర్హులు, పదోన్నతి ఇష్టం లేనివారు ఐదుగురు, ఒకరు అర్హత ఉన్నా చార్జెస్ పెండింగ్ ఉన్నాయి. ప్రస్తుతం జారీ చేసిన నోటీసు బహిరంగంగా ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం సీనియారిటీ జాబితాను సిద్ధం చేస్తారు. ఆ తరువాత సీనియార్టీ జాబితాపై మరోసారి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం పదోన్నతులు కల్పిస్తారు.
ఉమ్మడి జిల్లాలో 16 ఆర్‌ఎస్‌డీటీ
పోస్టుల ఖాళీ
ఎస్‌ఏ, ఆర్‌ఐలకు ఆర్‌ఎస్‌డీటీలుగా పదోన్నతికి చర్యలు
85 మంది సిబ్బందిని చూపిస్తూ
నోటీసు జారీ


