పుట్టపర్తి అర్బన్: జిల్లాలో ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన 71 బస్సుల్లో లోపాలు గుర్తించినట్లు ఆర్టీఓ కరుణాసాగర్‌రెడ్డి తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సమయానికి సరిదిద్దకపోతే యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మోటారు వాహన చట్టం 1988(ఏఐఎస్3) ప్రకారం విద్యార్థుల భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బస్సులు ఉన్నాయా? లేదా అనే అంశంపై జిల్లా వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. మొత్తం 596 విద్యాసంస్థల బస్సులు ఉండగా శనివారం నాటికి ఐదు బృందాల ద్వారా 85 విద్యాసంస్థలకు చెందిన 244 బస్సులను పూర్తి స్థాయిలో తనిఖీ చేసినట్లు వివరించారు. ఇందులో ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, ఇన్సూరెన్స్, డ్రైవర్ లైసెన్స్ పత్రాల్లో లోపాలు, స్పీడ్ గవర్నర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, అగ్నిమాపక సిలిండర్లు, ప్రథమ చికిత్స కిట్లు లేని 71 బస్సులకు చెందిన స్కూల్ యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. నిర్ణీత గడువులోపు లోపాలను సరిదిద్ది సంబంధిత పత్రాలను రవాణా శాఖ కార్యాలయంలో సమర్పించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సరిదిద్దకపోతే కఠిన చర్యలు తప్పవు
ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు ఆర్టీఓ హెచ్చరిక


