హంద్రీ–నీవా కాలువలో పడి బీటెక్‌ విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

హంద్రీ–నీవా కాలువలో పడి బీటెక్‌ విద్యార్థి మృతి

May 16 2026 5:05 AM | Updated on May 16 2026 5:05 AM

హిందూపురం: మండలంలోని రాచపల్లి శివారున హంద్రీ–నీవా కాలువ నీటి ప్రవాహంలో ప్రమాదవశాత్తు బీటెక్‌ విద్యార్థి పడి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం పశువులను మేపు కోసం రాచపల్లికి చెందిన బీటెక్‌ విద్యార్థి చేతన్‌రెడ్డి (19) తోలుకెళ్లాడు. మధ్యాహ్నం కాలువ వద్ద నీరు తాగేందుకు పశువులను వదిలిన సమయంలో ప్రమాదవశాత్తూ అదుపు తప్పి నీటి ప్రవాహంలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు గంటల పాటు గాలించినా ఆచూకీ లభించలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

బీ–ఫార్మసీ సప్లి ఫలితాల విడుదల

అనంతపురం టౌన్‌: జేఎన్‌టీయూ(ఏ) పరిధిలో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో నిర్వహించిన బీ–ఫార్మసీ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ మేరకు వర్సిటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్‌ ఆచార్య నాగప్రసాద్‌ నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. బీ–ఫార్మసీ నాల్గో సంవత్సరం మొదటి, రెండో సెమిస్టర్‌ ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. కార్యక్రమంలో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఆచార్య శివకుమార్‌, డాక్టర్‌ శారద, డాక్టర్‌ అంకారావు, శ్రీధర్‌ పాల్గొన్నారు.

శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు

కదిరి టౌన్‌: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకలను శుక్రవారం ఆలయ అధికారులు లెక్కించారు. 59 రోజులకు గాను రూ 1,15,13,345 నగదు, 24 గ్రాముల బంగారం, 480 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ ఈఓ వి. శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ హుండీల పర్యవేక్షణాధికారి, బ్యాంక్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అదృశ్యమైన వ్యక్తి మృతి

మడకశిర రూరల్‌: ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి మృతదేహమై కనిపించాడు. పోలీసులు తెలిపిన మేరకు... మడకశిర మండలం గౌడనహళ్లి గ్రామానికి చెందిన చంద్రప్ప (50)కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మద్యానికి బానిసైన చంద్రప్ప ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని ఓ పొలంలో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడిని చంద్రప్పగా కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. పొలం వద్దకు వెళ్లిన సమయంలో దాహంతో అలమటిస్తూ వడదెబ్బ సోకి మృతి చెంది ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

1 నుంచి ప్రభుత్వ భవనాలకు ప్రీ పెయిడ్‌ స్మార్టు మీటర్లు

అనంతపురం టౌన్‌: ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్‌ సర్వీసులకు జూన్‌ 1 నుంచి ప్రీ పెయిడ్‌ మీటర్లను అమల్లోకి తీసుకువస్తున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకల్‌ లోతేటి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతపురం జిల్లాలో 8,422, శ్రీ సత్యసాయి జిల్లాలో 7,002 సర్వీసులకు ప్రీ పెయిడ్‌ విధానంలో విద్యుత్‌ సరఫరా అవుతుందన్నారు. ఈ విధానంలో వినియోగదారుల్లో జవాబుదారీతనం మరింత మెరుగుపడుతుందన్నారు. రోజువారీ విద్యుత్‌ వినియోగం ఏ స్థాయిలో ఉందో సులువుగా తెలుసుకోవచ్చని, దీంతో విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. స్మార్ట్‌ మీటర్‌ సర్వీసులను గ్రూప్‌గా ఏర్పాటు చేసి ఈ–వాలెట్‌ ద్వారా రీచార్జ్‌ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తామన్నారు. విద్యుత్‌ చార్జీలు, స్థిర చార్జీల అడ్వాన్స్‌ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రతి వినియోగదారునికి ఎస్‌ఎంఎస్‌ రూపంలో మొబైల్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని, బ్యాలెన్స్‌ సున్నాకు చేరినప్పుడు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement