ఆర్టీసీ బస్టాండ్‌లో దొంగల బెడద | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్టాండ్‌లో దొంగల బెడద

May 16 2026 5:05 AM | Updated on May 16 2026 5:05 AM

ఉరవకొండ: ఆర్టీసీ బస్టాండ్లలో దొంగల బెడద తీవ్రమైంది. ఉరవకొండ, కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్టాండ్లలో ఈ తీవ్రత మరీ ఎక్కువగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. బస్సులు ఎక్కే సమయంలో గేటు వద్ద భారీ జనం గుమిగూడటాన్ని ఆసరాగా చేసుకుని వారి జేబుల్లోని సెల్‌ఫోన్లను దొంగలిస్తున్నారు. శుక్రవారం ఉరవకొండలో ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోహన్‌కృష్ణ జేబులోని ఖరీదైన మొబైల్‌ను దుండగులు అపహరించారు. ఈ ఘటనపై ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాక సీసీ కెమెరా పుటేజీల్లో అనుమానితుడి ఫొటోను పోలీసులకు అందించారు. అలాగే మూడు రోజులుగా నాలుగు విలువైన సెల్‌ఫోన్లను ప్రయాణికుల నుంచి దుండగులు అపహరించినట్లుగా సమాచారం. రెండు రోజుల క్రితం కళ్యాణదుర్గంలోనూ అనంతపురం వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఇద్దరు ప్రయాణికుల వద్ద సెల్‌ఫోన్లను దుండగులు అపహరించారు. కంబదూరు గ్రామానికి చెందిన ఓ మహిళ తన బ్యాగ్‌లో రూ.3లక్షల విలువైన బంగారు ఆభరణాలు పెట్టుకుని బస్టాండ్‌కు చేరుకోగా, కొద్ది సేపటికే బ్యాగులోని బంగారు గొలుసును దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు ఇప్పటికై నా స్పందించి ఆర్టీసీ బస్టాండ్లలో చోరీలను అరికట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.

అంధకారంలో

నాలుగు గ్రామాలు

బొమ్మనహాళ్‌: మండలంలోని మైలాపురంలో గురువారం సాయంత్రం వీచిన పెనుగాలులు నాలుగు గ్రామాలను అంధకారంలోకి నెట్టేశాయి. రెండు రోజులుగా విద్యుత్‌ లేక ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారు. రైస్‌మిల్‌ గోడ కూలి ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తి గాయపడిన విషయం తెలిసిందే. పెను గాలులకు విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరగడంతో మైలాపురం, ఏలంజి, కానాపురం, కొత్తూరు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా తాగునీటి సమస్య తీవ్రమైంది. శుక్రవారం ఉదయం మైలాపురంలో బొమ్మనహాళ్‌ తహసీల్దార్‌ మునివేలు పర్యటించి నష్టాన్ని పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. నష్టంపై పూర్తి నివేదికను సిద్దం చేసి ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు తెలిపారు. విద్యుత్‌శాఖ ఏఈఈ లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ.. మైలాపురం ఫీడర్‌ పరిధిలో 11 కేవీ లైన్‌కు చెందిన 52 విద్యుత్‌ స్తంభాలు, ఏలంజికి చెందిన 26 స్తంభాలు, 10 ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగినట్లుగా తెలిపారు. అలాగే కానాపురం ఫీడర్‌ పరిధిలో 40 విద్యుత్‌ స్తంభాలు, 6 ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమయ్యాయన్నారు. విద్యుత్‌ సరఫరా పునరుద్దరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ద్విచక్ర వాహనాల ఢీ ..

ఒకరి దుర్మరణం

విడపనకల్లు: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామ శివారున ఈ ఘటన చోటు చేసుకుంది. ఉరవకొండ మండలం వ్యాసాపురం గ్రామానికి చెందిన రాజన్న, నల్లారెడ్డి ఇద్దరూ ఒకే ద్విచక్ర వాహనంపై శుక్రవారం పాల్తూరు నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. గాజుల మల్లాపురం సమీపంలోని పెద్ద వంక వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న పంపన్న గౌడ్‌ (67) ద్విచక్ర వాహనం, రాజన్న బైక్‌ పరస్పరం ఢీకొన్నాయి. ఘటనలో బైక్‌ మీద నుంచి కిందపడి తలకు తీవ్ర గాయం కావడంతో పంపన్న గౌడ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయ పడిన రాజన్న, నల్లారెడ్డిని అటుగా వెళుతున్న వారు వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పాల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement