ప్రభుత్వ ఆఫీసులకూ ‘స్మార్ట్‌ మీటర్లు’ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆఫీసులకూ ‘స్మార్ట్‌ మీటర్లు’

May 16 2026 4:53 AM | Updated on May 16 2026 4:53 AM

అనంతపురం టౌన్‌: ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్‌ సర్వీసులకు జూన్‌ 1 నుంచి ప్రీ పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించనున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌ లోతేటి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతపురం జిల్లాలో 8,422, శ్రీ సత్యసాయి జిల్లాలో 7,002 సర్వీసులకు ప్రీ పెయిడ్‌ విధానంలో విద్యుత్‌ సరఫరా అవుతుందన్నారు. ఈ విధానంలో వినియోగదారుల్లో జవాబుదారీతనం మరింత పెరుగుతుందన్నారు. రోజువారీ విద్యుత్‌ వినియోగం ఏ స్థాయిలో ఉందో సులువుగా తెలుసుకోవచ్చని, తద్వారా విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. స్మార్ట్‌ మీటర్‌ సర్వీసులను గ్రూప్‌గా ఏర్పాటు చేసి ‘ఈ–వాలెట్‌’ ద్వారా రీచార్జ్‌ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తామన్నారు. విద్యుత్‌ చార్జీలు, స్థిర చార్జీల అడ్వాన్స్‌ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందన్నారు. వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో మొబైల్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని, బ్యాలెన్స్‌ సున్నాకు చేరినప్పుడు సరఫరా నిలిచిపోతుందని సీఎండీ వెల్లడించారు.

‘చల్లటి’ కబురు

రాగల ఐదు రోజులు

తేలికపాటి వర్షసూచన

అనంతపురం అగ్రికల్చర్‌: భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాగల ఐదు రోజులూ ఉమ్మడి జిల్లాకు తేలికపాటి వర్ష సూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.విజయశంకరబాబు, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ జి.నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు 1 నుంచి 3 మి.మీ మేర తేలికపాటి సగటు వర్షసూచన ఉందన్నారు. పగటి వేళ 41.6 డిగ్రీల నుంచి 41.4 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావొచ్చన్నారు. అలాగే రాత్రి వేళల్లో 25.4 డిగ్రీల నుంచి 26.8 డిగ్రీల మధ్య రికార్డు కావొచ్చన్నారు. గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలి వీస్తుందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement