మడకశిర: చింత రైతులు మరోసారి నష్టాల బాట పట్టారు. ఈ ఏడాది దిగుబడి తగ్గిపోవడం, మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. జిల్లాలోనే చింతపండు ఉత్పత్తికి మడకశిర నియోజకవర్గం ప్రసిద్ధి. నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో దాదాపు 30 వేల చింతచెట్లు ఉన్నాయి. 15 వేల మంది రైతులు చింతచెట్లపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇతర పంటలను సాగు చేసి నష్టపోయిన రైతులను చింత చెట్లు ఆర్థికంగా అంతో ఇంతో ప్రతి ఏడాది ఆదుకునేవి.
ముగిసిన చింతపండు సీజన్
నియోజకవర్గంలో చింతపండు సీజన్ ఈ ఏడాది దాదాపుగా ముగిసింది.ప్రతి ఏడాది జనవరి చివరిలో చింతపండు సీజన్ ప్రారంభమవుతుంది. మే చివరి దాకా సీజన్ కొనసాగుతుంది. అయితే ఈ ఏడాది చింతపండు దిగుబడి పూర్తిగా తగ్గడంతో సీజన్ మే మధ్యలోనే ముగిసే పరిస్థితి ఏర్పడింది.
రూ.1.50 కోట్లకు పడిపోయిన ఉత్పత్తి
నియోజకవర్గంలో ప్రతి ఏడాది రూ.3 కోట్ల విలువ చేసే చింతపండు ఉత్పత్తి జరగాల్సి ఉంది. అయితే ఈ ఏడాది సగానికి సగం తగ్గి పోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈ ఏడాది రూ.1.50 కోట్ల విలువ చేసే చింత పండు మాత్రమే ఉత్పత్తి అయిందంటున్నారు. దిగుబడి ఎన్నడూ లేని విధంగా ఈఏడాది తగ్గి పోయింది. దీంతో చింతపండు ఉత్పత్తి విలువ కూడా పడిపోయింది.
ధరలు నిలకడగా కొనసాగినా....
ఈఏడాది చింతపండు ధరలు ప్రారంభం నుంచి చివరి దాకా దాదాపుగా నిలకడగానే కొనసాగాయి. ప్రారంభంలో మొదటి రకం (కరిపుళి) చింతపండు ధర రూ.క్వింటాల్ రూ.25 వేల వరకూ పలికింది. అదే విధంగా రెండో (ఫ్లవర్) చింతపండు ధర ప్రారంభంలో క్వింటాలు రూ.15 వేల వరకూ పలికింది. ఆ తర్వాత చింతపండు ధరలు కొంత మేరకు తగ్గినా పూర్తిస్థాయిలో ధరలు పడిపోలేదు. రైతులకు గిట్టుబాటు అయ్యే విధంగానే ధరలు కొనసాగాయి. చివరిలో కూడా మొదటిరకం చింతపండు ధర రూ.18 వేలు, రెండో రకం ధర రూ.10 వేల వరకూ పలికాయి. అయితే ధరలు నిలకడగా కొనసాగినా దిగుబడి లేకపోవడంతో చింత పండు రైతులకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు కాలేదు.
ఉత్పతి వ్యయం పెరగడం రైతులకు శాపం
చింతపండు ఉత్పత్తి వ్యయం కూడా ఈ ఏడాది భారీగా పెరిగింది. దీంతో చింతపండు రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చింతపండు ఉత్పత్తిలో కూలీలు కీలక పాత్ర పోషిస్తారు. ఈ ఏడాది కూలీ ఖర్చులు సగానికి సగం పెరిగాయి. దిగుబడి తగ్గడం, కూలీ ఖర్చులు పెరగడం చింతపండు రైతులకు శాపంగా మారింది. ఈఏడాది రైతులు మగ కూలీకి రోజూ రూ.1000 చెల్లించారు. గత ఏడాది మగ కూలీకి రూ.700 చెల్లించారు. ఆడ కూలీకి ఈఏడాది రూ.350 చెల్లించారు. గత ఏడాది రూ.250 మాత్రమే చెల్లించారు. ఇలా కూలీ ఖర్చులు విపరీతంగా పెరగడంతో చింతపండు రైతులకు ఈఏడాది గిట్టుబాటు కాలేదు.
మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో..
మడకశిర నియోజకవర్గంలో మార్కెట్ సౌకర్యం లేదు. హిందూపురం మార్కెట్‌కు అమ్మకానికి వచ్చే చింతపండులో సగం మడకశిర ప్రాంతానికి చెందినదే ఉంటుంది. మడకశిర ప్రాంతం నుంచి చింతపండును హిందూపురానికి తరలించడానికి రైతులు రవాణా ఖర్చులను రూ.వేలల్లో భరించాల్సి వస్తోంది.
మడకశిరలో ప్రతి ఏడాది రూ.3 కోట్ల విలువ చేసే
చింతపండు ఉత్పత్తి
ఈ ఏడాది ఉత్పత్తి విలువ
అర్ధానికి పడిపోయిన వైనం
దిగుబడి తగ్గిపోవడంతోనే
ఈ దుస్థితి
గిట్టుబాటు కాక నష్టాల్లోకి రైతులు


