పరిగి: మంత్రి సవిత పెనుకొండ నియోజకవర్గానికి అనకొండగా మారిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ విమర్శించారు. భూకబ్జాల్లో సవిత ఆరితేరిపోయారని, అధికారమే అడ్డుగా ఆమె చేస్తున్న భూకబ్జాలతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారన్నారు. గురువారం ఆమె పరిగి మండలంలోని కొడిగెనహళ్లి పంచాయతీ కాలువపల్లిలో నిర్వహించిన ‘కాఫీ విత్ వైఎస్సార్‌సీపీ లీడర్స్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత కాలువపల్లి గేట్ నుంచి పార్టీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ప్రతి గడపకూ వెళ్లి ప్రజలతో మమేకమై చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు.
కబ్జా మంత్రిగా పేరు..
పెనుకొండలో మంత్రి సవిత ప్రోద్బలంతో భూకబ్జాలకు పాల్పడుతున్నారని, ఆమె అనుచరుడు హరికృష్ణ యథేచ్ఛగా కబ్జా చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఉషశ్రీచరణ్ ప్రశ్నించారు. అక్రమ లేఅవుట్లకు అనుమతుల పేరుతో లక్షలాది రూపాయలను వసూలు చేయడం సిగ్గు అనిపించడం లేదా? అని మండిపడ్డారు. సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ పెద్దలు సూపర్ మోసాలకు పాల్పడుతూ ప్రజలను అన్యాయం చేశారని విమర్శించారు. బీసీ సంక్షేమశాఖ మంత్రిగా బీసీలను సవిత మోసం చేశారని, 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పి మాట తప్పిన మంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను మోసం చేసిందంటూ సవిత తల్లి స్వయాన కుమార్తైపె కోర్టులో కేసు వేసిన సంగతి జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు.
సత్యసాయి కార్మికుల ఉసురు తగులుతుంది
జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెంటనే సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులను ఆదుకోవాలని ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. జీతాలు చెల్లించలేక కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. వారి ఉసురు తప్పక చంద్రబాబు ప్రభుత్వానికి తగులుతుందన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నరసింహమూర్తి, మాజీ సర్పంచ్ సాకమ్మ, గిరి, ఎంపీటీసీ చిక్కన్న, అంజి, మారుతీరెడ్డి, అడ్వొకేట్ వన్నేరువప్ప, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెనుకొండను అనకొండగా
మార్చారు
తల్లికి ద్రోహం చేసిన ఘనత
సవితకే చెల్లింది
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్


