బొమ్మనహాళ్: గాలివాన విధ్వంసం మైలాపురం గ్రామాన్ని అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా విరుచుకుపడిన వర్షం ప్రభావంతో ఐదేళ్ల క్రితం మూతపడిన పాత రైస్ మిల్లు గోడ కూలి గొర్రెల కాపరి మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తుల సమచారం మేరకు.. గురువారం సాయంత్రం మైలాపురం గ్రామానికి చెందిన హరిజన వెంకటేశులు (55), కురుబ శివ అనే ఇద్దరు కాపరులు గొర్రెలు కాసుకుంటూ ఉండి ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో గాలివాన ప్రారంభమైంది. వెంటనే వర్షం నుంచి తప్పించుకునేందుకు గ్రామ శివారులోని పాత రైస్‌మిల్లు వద్దకు చేరుకున్నారు. వర్షంలో తడవకుండా రైస్‌మిల్లు గోడకు ఆనుకొని నిల్చున్నారు. బలంగా గాలి వీచడంతో బలహీనంగా ఉన్న గోడ కుప్పకూలింది. గోడ కింద పడి హరిజన వెంకటేశులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కురుబ శివ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. స్ధానికులు వెంటనే శివను బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో దాదాపు 30 గొర్రెలు గోడకింద పడి మృతి చెందాయి. గాలివాన ధాటికి 12 ట్రాన్స్‌ఫార్మర్లు, 30కిపైగా విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనేక రేకుల షెడ్లు గాలికి ఎగిరిపోయాయి. కొంతమంది ఇళ్ల పైకప్పులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ హఠాత్పరిణామంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ విజయ్‌కుమార్ సంఘటన స్ధలాన్ని పరిశీలించారు.
ఎగిరిపోయిన సోలార్ ప్యానెళ్లు..
మండలంలోని ఉంతకల్లు ఆర్డీటీ కాలనీలో పలు ఇళ్లపై ఉన్న సోలార్ ప్యానెళ్లు ఈదురుగాలులకు ఎగిరిపోయాయి. ఉంతకల్లు క్రాస్‌లోని బళ్లారి–కళ్యాణదుర్గం ఆర్‌అండ్‌బీ రహదారిపై పెద్ద వేపమాను నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కొంతసేపటి తర్వాత స్ధానికులు, పోలీసులు చెట్టును రోడ్డుపై నుంచి తొలగించారు.
గోడ కూలి కాపరి మృతి
మరొకరికి తీవ్ర గాయాలు
నేలకొరిగిన ట్రాన్స్‌ఫార్మర్లు,
స్తంభాలు


