కన్నీటి కష్టం.. ప్రశ్నించలేని దైన్యం | - | Sakshi
Sakshi News home page

కన్నీటి కష్టం.. ప్రశ్నించలేని దైన్యం

May 15 2026 12:13 PM | Updated on May 15 2026 12:13 PM

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: రాప్తాడు నియోజకవర్గంలో నియంతృత్వ పోకడలు తారాస్థాయికి చేరుకున్నాయి. తన పరిధిలో ఎలాంటి సమస్యలు లేవని, ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారంటూ పార్టీ అధిష్టానం మెప్పు పొందే క్రమంలో ప్రజాగొంతుకను స్థానిక ప్రజాప్రతినిధి తొక్కి పెట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజాప్రతినిధిని, నాయకులను, చివరకు అధికారులను సైతం అడగలేని నిస్సహాయ స్థితిలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు.

ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత పంచాయతీ నసనకోటతో పాటు పెద్దకొండాపురంలో కొన్ని నెలలుగా తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నాయకులు, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో గుక్కెడు నీటి కోసం ఆయా గ్రామాల ప్రజలు కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బోరు బావుల నుంచి సేకరించుకోవాల్సి వస్తోంది. భయం గుప్పిట్లో నలుగుతున్న ఆయా గ్రామాల ప్రజలు సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని నాయకులకు, అధికారులకు విన్నవించుకోలేక పోతున్నారు. ఒకవేళ ధైర్యం చేసి విన్నవించినా ఎలాంటి దారుణాలు చవి చూడాల్సి వస్తుందోననే ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది. దీంతో వ్యవసాయ బోరు బావుల వద్ద పడిగాపులు కాస్తూ రైతులు మోటార్లు ఆన్‌ చేసినప్పుడు నీరు పట్టుకుంటున్నారు. ఫలితంగా సొంత పనులు కూడా చేసుకోలేక సతమతమవుతున్నారు. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి. ట్యాంకర్ల ద్వారా అధికారులు సరఫరా చేస్తున్న నీరు తమ అవసరాలకు ఎంత మాత్రమూ సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.

పొలం వద్ద నుంచి నీటిని తీసుకెళుతున్న దృశ్యం

పెద్దకొండాపురంలో ఇళ్ల వద్ద ఏర్పాటు చేసుకున్న డ్రమ్ములు

పరిటాల సొంత మండలంలో

వేళ్లూనుకుంటున్న విషసంస్కృతి

సమస్య పరిష్కారంపై చొరవ చూపని ఎమ్మెల్యే సునీత

ఇబ్బందులు చెప్పుకునేందుకు

జంకుతున్న స్థానికులు

పేరూరు డ్యాంకు నీరు

అధికారంలోకి వచ్చిన వెంటనే పేరూరు డ్యాం (అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్ట్‌)కు నీరందిస్తామంటూ ఎన్నికల సమయంలో పరిటాల సునీత స్పష్టమైన హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఈ హామీ నెరవేరలేదు. అంతేకాక డ్యాంలో ఉన్న కొద్దిమేర నీటిని గేట్ల మరమ్మతు పేరుతో దిగువకు వదిలేయడంతో ప్రస్తుతం చుక్క నీరు లేకుండా రిజర్యావర్‌ వట్టి పోయింది. దీంతో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల్లో నీరు అందకుండా పోయింది. పంట సాగు దేవుడెరుగు... కనీసం గొంతు తడుపుకుందామనుకున్నా.. గుక్కెడు నీరు లభ్యం కాక గ్రామీణులు విలవిల్లాడుతున్నారు.

పరిటాల సొంత ఇలాకా రామగిరి మండల వాసులు గతంలో ఎన్నడూ లేని విధంగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే పరిటాల సునీత ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో ప్రజల ఇక్కట్లు రెట్టింపయ్యాయి. అయితే తమ తాగునీటి కష్టాలపై ఎమ్మెల్యే సునీతను కనీసం ప్రశ్నించలేని అసహాయ స్థితిలో స్థానికులు కొట్టుమిట్టాడుతున్నారు. సమస్యపై గళమిప్పితే ఎలాంటి దౌర్జన్యాలు చవిచూడాల్సి వస్తోందోనని భయపడుతున్నారు.

భయం గుప్పిట్లో గ్రామీణులు

Advertisement
 
Advertisement
Advertisement