● లోకేష్ సమావేశంలో భజనపరులకు పెద్దపీట
అనంతపురం క్రైం: మంతి నారా లోకేష్ గురువారం అనంతపురంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమన్వయ సమావేశంపై సొంత పార్టీ కార్యకర్తలే విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యులను కాదని భజన పరులకు పెద్ద పీట వేశారంటూ మండిపడుతున్నారు. సమావేశానికి ముందు జెడ్పీ ఎదుట ఉన్న రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో జిల్లా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశమై ఎవరిని లోపలికి అనుమతించాలనే అంశంపై చర్చించి జాబితా సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో పలువురు సీనియర్ కార్యకర్తలు సమావేశం వద్దకు వెళ్లినా ‘జాబితాలో మీ పేరు లేదు’ అంటూ వెనక్కి పంపించేశారు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయులను సమావేశానికి పూర్తిగా దూరం పెట్టేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రమేయమే ఇందుకు కారణంగా పలువురు ఆరోపిస్తున్నారు. సమావేశానికి మీడియా ప్రతినిధులను సైతం అనుమతించలేదు. అంతర్గత విభేదాలు బయట పడకుండా ఉండేందుకే మీడియాను దూరంగా ఉంచినట్లు సమాచారం.
ఆర్టీటీ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి
బత్తలపల్లి: నిరుపేదలకు ఆర్టీటీ అందిస్తున్న సేవలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ అయిన తరువాత తొలిసారి ఆయన గురువారం రాత్రి బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రిని సందర్శించి రోగులతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. తాను యువగళం పాదయాత్ర సందర్భంగా ఆర్డీటీ గురించి విన్నానని, ఆర్డీటీ చేపట్టిన కార్యక్రమాలను కళ్లారా చూశానన్నారు. దివ్యాంగులు, ఇతరులను ఆర్డీటీ ప్రోత్సహిస్తున్న తీరు అద్భుతమన్నారు. ఇతర జిల్లాల్లోనూ ఆర్డీటీ సేవలు విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అర్డీటీకి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. అంతకు ముందు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఘాట్ వద్ద మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సవిత, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, హిందుపురం ఎంపీ బీకే పార్థసారథి, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా, ఆర్డీటీ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చొరవ తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ పేర్కొనడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు స్తంభించాయి కదా అని విలేకరులు ప్రశ్నించారు. దీంతో ‘అంతపెద్ద మాటలు వద్దులే గురువుగారు’ అంటూ మాట మార్చారు. ఇక ‘నీట్ పరీక్ష రద్దు’పై విలేకరులు ప్రశ్నించగా... ఇక్కడొద్దు అంటూ దాటవేశారు. అనంతరం మంత్రి లోకేష్‌కు ఆర్డీటీ పొగ్రామ్ డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ అభినందలు తెలిపారు.
లోకేష్‌కు ఘన స్వాగతం
పుట్టపర్తి అర్బన్: మంత్రి నారా లోకేష్‌కు పుట్టపర్తి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆయనతో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సవిత ఉన్నారు. ఎంపీలు పార్థ సారధి, అంబికా లక్ష్మీనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్, జేసీ మౌర్య భరద్వాజ్, ఆర్డీఓ సువర్ణ ఘన స్వాగతం పలికారు.


