వెలగని ‘దీపం’ ! | - | Sakshi
Sakshi News home page

వెలగని ‘దీపం’ !

May 14 2026 10:53 AM | Updated on May 14 2026 10:53 AM

కదిరి: అధికారంలోకి వస్తే మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలెండర్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఆ పథకం ద్వారా సగం మంది దీపం వంట గ్యాస్‌ వినియోగదారులకు కూడా లబ్ధి చేకూరడం లేదు. రాయితీ సొమ్ము సకాలంలో జమకాక లక్ష మందికి పైగా లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. సిలిండర్లు డెలివరీ అయినా సబ్సిడీ సొమ్ము తమ బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడంతో లబ్ధిదారులు గ్యాస్‌ ఏజెన్సీలు, సచివాలయాలతో పాటు తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.

4 నెలలకు ఒక సిలెండర్‌..

ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2024 డిసెంబర్‌లో ప్రారంభించింది. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్‌ చొప్పున డబ్బుపెట్టి తీసుకుంటే తర్వాత రెండు రోజుల్లోగా ప్రభుత్వం సిలిండర్‌కు రూ.851 నగదు జమ చేస్తుంది. ఇలా ఒక్కో లబ్ధిదారుడికి ఏడాదికి 3 సిలిండర్‌లకు కలిపి రూ.2,415 రాయితీ నగదు జమ చేయాల్సి ఉంది. 2024 డిసెంబర్‌–మార్చి తొలివిడత, ఏప్రిల్‌–జూలై రెండో విడత, ఆగస్టు–నవంబర్‌ మూడో విడత చొప్పున ఇప్పటికి ఏడు విడతలు పూర్తయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 8వ విడత ప్రారంభమైంది. జిల్లాలో 7వ విడతలో దీపం కింద 3,42,621 సిలిండర్లు పంపిణీ చేస్తే 1,25,112 మంది లబ్ధిదారులకు ఇప్పటి దాకా నగదు జమ కాలేదు. వీరికి రూ.11 కోట్లకు పైగా నగదు జమ కావాల్సి ఉంది. ఒక్క విడత కూడా నగదు జమ కాని వారు జిల్లాలో 70,215 మంది ఉన్నారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

అర్జీలు బుట్టదాఖలు..

గ్యాస్‌ కనెక్షన్‌, ఆధార్‌తో పాటు రేషన్‌కార్డు అనుసంధానం కాకపోవడం, గ్యాస్‌ ఏజెన్సీలో రిజిస్టర్‌ అయిన బ్యాంకు ఖాతా వివరాలు వేరుగా ఉండటం, పాత దీపం కనెక్షన్‌ వివరాలు కొత్త దీపం–2 సర్వర్‌తో అప్‌డేట్‌ కాకపోవడం ఇలా పలు కారణాలతో చాలా మంది అర్హులైనప్పటికీ నగదు కోల్పోతున్నారు. సంబంధిత అధికారులకు పలుమార్లు అర్జీలు ఇచ్చినప్పటికీ తమ సమస్య పరిష్కారం కాలేదని అర్హులైన లబ్ధిదారులు వాపోతున్నారు. కుటుంబంలో ఎవరి పేరుమీద గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నా..వారి పేరు రేషన్‌ కార్డులో ఉంటే చాలు. దీపం పథకానికి అర్హులే.. అనే నిబంధనలున్నా, ఈ విషయంలో సంబంధిత అధికారులు కొందరికి సరైన అవగాహన లేకపోవడంతో జిల్లాలో ఎంతోమందికి రాయితీకి దూరమవుతున్నారు.

లబ్ధిదారుల ఖాతాల్లో

జమకాని రాయితీ

గ్యాస్‌ ఏజెన్సీల చుట్టూ

లబ్ధిదారుల ప్రదక్షిణ

అధికారులకు చెప్పినా

ప్రయోజనం సున్నా

ఉచిత సిలిండర్లు

ఉత్తుత్తి మాటే అంటున్న జనం

చిలమత్తూరు మండలం శెట్టిపల్లికి చెందిన రమణ దీపం–2 పథకం ద్వారా వంట గ్యాస్‌ బుక్‌ చేసుకుంటున్నారు. కానీ ఒక్కసారి కూడా రాయితీ సొమ్ము అందలేదు. అధికారులను అడిగితే ‘మీ పేరు మీద వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు ఉంది. అందుకే మీరు అర్హులు కాదు’ అన్నారు. వాస్తవానికి ఆయన ఇల్లు 700 చదరపు అడుగుల లోపే ఉంది. ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. ఇలాంటి వారు జిల్లా వ్యాప్తంగా లక్ష మందికి పైగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement