కదిరి మున్సిపల్‌ స్పెషలాఫీసర్‌గా జేసీ | - | Sakshi
Sakshi News home page

కదిరి మున్సిపల్‌ స్పెషలాఫీసర్‌గా జేసీ

May 14 2026 10:53 AM | Updated on May 14 2026 10:53 AM

కదిరి: కదిరి మున్సిపాలిటీ స్పెషల్‌ ఆఫీసర్‌గా జేసీ మౌర్య భరద్వాజ్‌ను ప్రభుత్వం నియమించింది. గత కొద్ది నెలలుగా కదిరి మున్సిపాలిటీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కమిషనర్‌గా ఉన్న కిరణ్‌కుమార్‌తో పాటు ఆయనకు పీఏ తరహాలో వ్యవహరించిన సచివాలయ శానిటరీ సెక్రెటరీ పరమేశ్వర్‌ అవినీతిపై ‘సాక్షి’ ఇటీవల వరుస కథనాలు ప్రచురించింది. దీంతో ఇరువురినీ తప్పించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ప్రభుత్వం మరో జీఓ విడుదల చేసింది. ప్రస్తుతం కదిరి మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఉన్న ఆర్‌డీఓ సన్యాసి శర్మకు ఇక్కడ జరుగుతున్న అవినీతి వ్యవహారాలు తెలిసినప్పటికీ దీన్ని ఆయన ‘మామూలు’గా తీసుకోవడంతో ప్రభుత్వం ఆయనను తప్పించింది. ఆయన స్థానంలో జాయింట్‌ కలెక్టర్‌ భరద్వాజ్‌ను ఇక్కడ ప్రత్యేక అధికారిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.సురేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

కలెక్టర్‌ను కలసిన జెడ్పీ సీఈఓ

ప్రశాంతి నిలయం: జిల్లా పరిషత్‌ నూతన సీఈఓ విజయలక్ష్మి బుధవారం కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లోని చాంబర్‌లో కలెక్టర్‌కు మొక్కను అందజేశారు. జిల్లా అభివృద్ధి, పరిపాలనా అంశాలపై ఆమెకు కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. అంతకు ముందు ఆమె అనంతపురం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు.

ఈశ్వరమ్మ సీబీఎస్‌ఈ సీనియర్‌ ఇంటర్‌లో అద్భుత ఫలితాలు

పుట్టపర్తి: స్థానిక ఈశ్వరమ్మ హయ్యర్‌

సెకండరీ స్కూల్‌ విద్యార్థులు

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో సత్తా చాటారని ప్రిన్సిపాల్‌ శివరామకృష్ణ పేర్కొన్నారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో పాఠశాలలోని విద్యార్థులంతా ఫస్ట్‌ క్లాస్‌లో ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో గ్రామీణ విద్యార్థుల కోసం సత్యసాయి బాబా తన తల్లి పేరుమీద పాఠశాలను స్థాపించినట్లు తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఏఈ మూడు గ్రూపుల్లో 30 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా అందరూ పాసయ్యారన్నారు. బ్రాహ్మణపల్లికి చెందిన షామీర్‌బాష, యాస్మిన్‌ దంపతుల కుమార్తె షేక్‌ సల్మా సీఏఈలో 95.6 శాతం పర్సేంటేజ్‌తో మొదటి ర్యాంకు సాధించగా, యామిని 91 మార్కులతో రెండో ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement