వలస కార్మికుడి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

వలస కార్మికుడి బలవన్మరణం

May 14 2026 10:53 AM | Updated on May 14 2026 10:53 AM

కదిరి టౌన్‌: పొట్ట కూటి కోసం తండ్రితో పాటు బిహార్‌ నుంచి వలస వచ్చిన ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బిహార్‌కు చెందిన ఉమేష్‌ పాశ్వాన్‌, ఆయన కుమారుడు చోటుకుమార్‌ (17) జీవనోపాధి కోసం కదిరికి వలస వచ్చారు. కొంత కాలంగా స్థానిక రాయచోటి మార్గంలోని ఓ రైస్‌మిల్‌లో తండ్రితో పనిలోకి చోటుకుమార్‌ వెళ్లేవాడు. రెండు నెలలుగా తరచూ ఫోన్లో మాట్లాడుతుండడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన చోటు కుమార్‌ మంగళవారం రాత్రి అతిగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

ఖాళీ బిందెలతో నిరసన

ఓడీచెరువు: తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ ఓడీ చెరువు మండలం ఇనగలూరు ఎస్సీ కాలనీ వాసులు ఖాళీ బిందెలతో బుధవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కదిరప్ప మాట్లాడారు. గ్రామంలోని దుర్గమ్మ గుడి వద్ద తాగునీటి పథకానికి సంబంధించి ఏర్పాటు చేసిన బోరు బావిలో మోటారు పైపులు పూర్తిగా తొలగించారన్నారు. మరమ్మతుల కారణంగా మారెమ్మ గుడి వద్ద ఉన్న మోటారు పనిచేయడం లేదన్నారు. దీంతో మూడు నెలలలుగా స్థానికులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విషయం అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా, సమస్య పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ ఏఓ రమణానాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాలనీ మహిళలు శ్రీలత, గంగులమ్మ, అనిత, నర్సమ్మ, తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి సమస్య పరిష్కరించాలి

పరిగి: స్థానిక సాయినగర్‌లో నెలకొన్న తాగునీటి సమస్యపై పరిష్కారం కోరుతూ బుధవారం కాలనీలో వాసులు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. పరిగి చెరువు నిండా నీరు ఉన్నా గుక్కెడు తాగునీటి కోసం ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్య పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతోందని మండిపడ్డారు. ఇప్పటికై నా నీటి సమస్యను పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ సచివాలయంలో అధికారులకు వినతిపత్రాన్ని అందించారు.

ద్విచక్ర వాహనాల దొంగల అరెస్ట్‌

ధర్మవరం అర్బన్‌: ద్విచక్ర వాహనాలను అపహరించుకెళుతున్న ఇద్దరు యువకులను అరెస్ట్‌ చేసినట్లు ధర్మవరం రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపారు. బుధవారం స్థానిక టూటౌన్‌ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. అనంతపురం జిల్లా ఇటుకలపల్లికి చెందిన చాకలి మధు, కదిరిలోని పార్థసారధి కాలనీకి చెందిన షేక్‌ ముబారక్‌ జల్సాలకు అలవాటు పడి, తమ అవసరాలకు ద్విచక్ర వాహనాలను అపహరించి, తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. బుధవారం ధర్మవరంలోని గుట్టకిందపల్లి సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టిన అక్కడే ఉన్న మధు, ముబారక్‌ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఎస్‌ఐ వీరేష్‌ అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో వారి నుంచి ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని, కేసు నబమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement