దొంగతనం కేసులో ముద్దాయికి జైలు | - | Sakshi
Sakshi News home page

దొంగతనం కేసులో ముద్దాయికి జైలు

May 14 2026 10:53 AM | Updated on May 14 2026 10:53 AM

పుట్టపర్తి అర్బన్‌: దొంగతనం కేసులో ముద్దాయి బెస్త మనోజ్‌కుమార్‌కు ఒక ఏడాది జైలు శిక్ష , రూ.2500 జరిమానా విధిస్తూ పుట్టపర్తి జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. వివరాలు.. 2017 మార్చి 9న కొత్తచెరువులోని నెహ్రూనగర్‌లోని సూర్యనారాయణ ఇంట్లో బెస్త మనోజ్‌కుమార్‌ దొంగతనం చేశాడు. ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై కొత్తచెరువు పోలీస్‌స్టేషన్‌లో అదే రోజు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని ముద్దాయిని రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం బుధవారం ముద్దాయికి జైలు శిక్షతో పాటు రూ.2,500 జరిమానా విధించారు. డీఎస్పీ శివన్నారాయణ పర్యవేక్షణలో పుట్టపర్తి ఏపీపీ ప్రత్యూష, లైజనింగ్‌ ఆఫీసర్‌ సీఐ ఇస్మాయిల్‌, ఎస్‌ఐ రాజశేఖర్‌, కోర్టు కానిస్టేబుల్‌ చంద్రానాయక్‌ సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పరిచారు. పోలీస్‌ అధికారులను, సిబ్బందిని ఎస్పీ సతీష్‌కుమార్‌ అభినందించారు.

యువకుడి ఆత్మహత్య

పెనుకొండ: నగర పంచాయతీ పరిధిలోని తిమ్మాపురం గ్రామానికిచెందిన అజయ్‌ (25) ఆత్మహత్య చేసుకున్నాడు. కార్పెంటర్‌గా పనిచేసేవాడు. ఇటీవల కుటుంబంలో మనస్పర్థలు చెలరేగడంతో మనస్తాపం చెందిన అతను బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

టీడీపీ నేత మోసంపై ఫిర్యాదు

కదిరి అర్బన్‌: పట్టాదారు పాసుబుక్కు చేయించి బ్యాంక్‌ రుణం ఇప్పిస్తానంటూ కేఎన్‌ పాళ్యం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నాగూరి శ్రీనివాసరెడ్డి తన వద్ద నుంచి రూ.లక్ష తీసుకుని మోసం చేశాడంటూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బుధవారం నల్లగుట్టతండాకు చెందిన లక్ష్మేనాయక్‌ నిరసన వ్యక్తం చేశాడు. సర్వే నంబర్‌ 848–2సీ, 586లో మొత్తం 6 ఎకరాలకు 1990లో దొంగ పాసుబుక్కులు చేయించాడని ఆరోపించారు. తనకు దొంగ పట్టా ఇచ్చిన సర్వే నంబర్‌లోని భూమి తన బంధువు, ముదిగుబ్బ మండలం గుడ్డంపల్లికి చెందిన రవినాయక్‌ పేరుపై ఉందన్నారు. ఈ మోసంపై టీడీపీ నేతను నిలదీసి డబ్బు వెనక్కు ఇవ్వాలని అడిగితే బెదిరిస్తున్నాడని, ఈ అంశంపై నాగూరి శ్రీనివాసరెడ్డిని విచారణ చేసి తమకు న్యాయం చేయాలని బాధితుడు డిమాండ్‌ చేస్తూ ఆర్డీఓ కార్యాలయ ఏఓ రవికుమార్‌కు వినతి పత్రం అందజేశాడు. అనంతరం కదిరి రూరల్‌ అప్‌గ్రేడ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.

ఫ్లాట్‌ఫారంపై వృద్ధుడి

మృతదేహం

గుంతకల్లు: స్థానిక రైల్వేస్టేషన్‌లోని 7వ ఫ్లాట్‌ఫారంపై బుధవారం ఉదయం ఓ వృద్ధుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. సుమారు 60 ఏళ్లు పైబడి ఉంటాయి. చామనఛాయ రంగులో ఉండి, తెలుపు రంగు పుల్‌షార్ట్‌, తెల్లటి పంచ ధరించి ఉన్నాడు. కుడి చిటికెన వేలుపై నల్లటి పుట్టు మచ్చ ఉంది. ఆచూకీ తెలిసిన వారు 90145 86555 కు సమాచారం అందించాలని జీఆర్పీ ఏఎస్‌ఐ ప్రేమ్‌కుమార్‌ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement