పెనుకొండరూరల్(సోమందేపల్లి): చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు కబ్జా చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉష శ్రీచరణ్ విమర్శించారు. సోమందేపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 746–1లో 1.80 ఎకరాల భూమిని మంత్రి సవిత అనుచరుడు హరికృష్ణ తన పేరు మీదుగా రికార్డులు బదలాయించుకున్న విషయం తెలుసుకున్న ఆమె బుధవారం నేరుగా తహసీల్దార్‌ను కలిసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో భూకబ్జాలు ఓ దినచర్యగా టీడీపీ నేతలు మలుచుకున్నారని మండిపడ్డారు. మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల పరిధిలో భూ పంపిణీ చేపట్టకూడదనే నిబంధన ఉన్నా... రూ. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకుడి పేరుపై ఎలా బదలాయిస్తారని ప్రశ్నించారు. కియా పరిసర ప్రాంతాలతో పాటు గోరంట్ల మండల పరిధిలోని బెస్ట్ యూనివర్సిటీ భూములను ఆక్రమించుకునేందుకు మంత్రి సవిత కుట్రలు పన్నుతున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అన్యాక్రాంతమైన భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉష శ్రీచరణ్


