ట్రాన్స్‌‘ఫార్మర్‌’ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌‘ఫార్మర్‌’ కష్టాలు

May 10 2026 9:46 AM | Updated on May 10 2026 9:46 AM

పుట్టపర్తి అర్బన్‌: ఆరుగాలం రెక్కలుముక్కలు చేసుకుని స్వేదం చిందించి పంటలు సాగుచేసే రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. సాగునీరు ఇబ్బందులతో రూ.లక్షలు ఖర్చు చేసి బోర్లు వేసుకున్నా...కరెంటు కనెన్షన్‌ ఇవ్వకుండా వేధిస్తున్నారు. విద్యుత్‌శాఖలోని కొందరు అవినీతి అధికారుల వల్ల రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళ్లముందే పంటలు ఎండుతుండగా కన్నీటిపర్యంతమవుతున్నారు.

ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.50 వేలు అదనం..

వ్యవసాయబోరుకు విద్యుత్‌ కనెక్షన్‌ కావాలంటే.. ముందుగా విద్యుత్‌ లైను లాగాలి. ఇందుకు విద్యుత్‌ స్తంభాలతో పాటు పలు పరికరాలు అవసరమవుతాయి. వీటిని ధర్మవరంలోని ఓ ప్రైవేటు వ్యాపారి వద్ద అధికారులు బలంవంతంగా కొనుగోలు చేయిస్తున్నారు. ఇక ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం ఒక్కో రైతు నుంచి రూ.20 వేల వరకూ డిపాజిట్‌ వసూలు చేస్తున్నారు. దీనికి అదనంగా ఒక్కో రైతు నుంచి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేస్తున్నారు. డబ్బు చెల్లించినా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పిన వారికి మాత్రం రోజుల వ్యవధిలోనే ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాలు ఇచ్చి పంపుతున్నారు.

ఫిర్యాదు చేసినా ఫలితం లేదు..

ఇటీవల రొద్దం మండలానికి చెందిన పలువురు రైతులు విద్యుత్‌ అధికారుల తీరుపై కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసి ఆందోళన చేయడంతో అదే వారంలో కొంత మందికి ట్రాన్స్‌ఫార్మర్లు ఇచ్చారు. రొద్దం మండలంలోని రొద్దం, కొత్తూరు దొడగట్ట తదితర గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు లేక వందలాది ఎకరాల్లో పంటలు ఎండుతుండగా.. ఇటీవల విద్యుత్‌ శాఖ కార్యాలయాన్ని రైతులు ముట్టడించి నిరసన తెలిపారు. వెంటనే ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

రెకమండేషన్‌ ఉంటే వెంటనే...

కొత్తచెరువు మండలంలో ట్రాన్స్‌ఫార్మర్ల కోసం పలువురు రైతులు డిపాజిట్లు చెల్లించారు. కానీ రెకమండేషన్‌ ఉన్న కొందరు రైతులకే ట్రాన్స్‌ఫార్మర్లు ఇచ్చారు. కొత్తచెరువు ఏఈ కేవలం టీడీపీ మద్దతుదారులకు రాత్రి వేళల్లో దొంగగా పరికరాలు అందజేస్తూ అర్హులైన రైతులకు అన్యాయం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మామూళ్లు సైతం రూ.50 వేలపైన ఇస్తే వెంటనే అన్ని సమకూరుతాయి. లేదంటే కొన్ని పరికరాలు ఇచ్చి తక్కినవి పెండింగ్‌ పెడుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు ఆలస్యంపై విద్యుత్‌ శాఖ డీఈ శివరాములును వివరణ కోరగా... త్వరలోనే అందరికీ అందజేస్తామని చెప్పారు.

డిపాజిట్‌ కట్టినా

ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరు చేయని అధికారులు

నెలల తరబడి విద్యుత్‌శాఖ కార్యాలయాల చుట్టూ

రైతుల ప్రదక్షిణ

పంటలు ఎండుతున్నా

పట్టించుకోని వైనం

మామూళ్లు ఇచ్చిన వారికి మాత్రం వెంటనే మంజూరు

Advertisement
 
Advertisement
Advertisement