పుట్టపర్తి అర్బన్: చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టిన నాటి నుంచి సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు కొత్త పింఛన్ల కోసం ప్రదక్షిణ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం నూతన పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న పింఛన్లను తొలగించుకుంటూపోతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి అర్హులందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తూ ఆనందం వెల్లివిరిసేలా చేస్తే... చంద్రబాబు ప్రభుత్వంలో వారి ఆనందం ఆవిరైపోయింది. రెండేళ్ల బాబు పాలనలో జిల్లాలో సుమారు 14,364 పింఛన్లు కోత వేయడంతో ఆ కుటుంబాలన్నీ ఆర్థికంగా చితికిపోయాయి.
ఎన్నాళ్లో ఎదురుచూపులు..
చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి దాకా ఎంతో మంది మహిళలు భర్తను పోగొట్టుకొని కుటుంబ పోషణ భుజాన వేసుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇంటి పట్టున ఉండే వృద్ధులు, అంగ వైకల్యంతో నానా అవస్థలు పడుతున్న దివ్యాంగులు నూతన పింఛన్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని 32 మండలాల ఎంపీడీఓ కార్యాలయాలు, కలెక్టరేట్, వెలుగు కార్యాలయాల్లో వితంతువుల దరఖాస్తులు సుమారు 10 వేలకు పైగా ఉంటాయని అంచనా ఉంది. అధికారులు, ఎమ్మెల్యేలు ఆయా గ్రామాలకు వెళ్లిన ప్రతిసారీ వేడుకుంటున్నా ఫలితం లేదని వాపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం రెండేళ్లుగా అదిగో ఇస్తాం, ఇదిగో ఇస్తాం అంటూ దాటవేస్తూనే ఉన్నారు.
బీసీలదీ అదే పరిస్థితి..
అధికారంలోకి వచ్చిన వెంటనే 50 ఏళ్లు వయస్సు పూర్తయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛన్ అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటి వరకూ అటువైపుగా కనీసం ఆలోచించలేదు. ఆయా క్యాటగిరిల్లో జిల్లాలో సుమారు 1.5 లక్షల మంది ఉన్నట్లు తెలిసింది. గ్రామాల్లోకి వెళ్తున్న ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తే మాత్రం అది పాలసీ మ్యాటర్ అంటూ దాటవేత ధోరణితో సమాధానం ఇస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందు కోసమేనా మేము మిమ్మల్ని గెలిపించింది అంటూ విమర్శిస్తున్నారు.
ఒకటో తారీఖు వస్తోందంటే చాలు పింఛన్‌దారులు సంతోషించాల్సింది పోయి ఆందోళన చెందాల్సిన దుస్థితి నెలకొంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా పింఛన్లలో కోతలు పెడుతుండటమే ఇందుకు కారణం. కొత్త పింఛన్లు మంజూరు చేయాల్సింది పోయి.. ఉన్న పింఛన్లు తొలగిస్తుండటంపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త పింఛన్లు మంజూరు చేయని
చంద్రబాబు సర్కార్
ఉన్న వాటినీ తొలగిస్తున్న వైనం
రెండేళ్లలో 14,364 పింఛన్ల రద్దు
లబోదిబోమంటున్న పింఛన్‌దారులు


