కదిరి: ప్రసవం కోసం తమ బిడ్డ వాణిశ్రీని సాయినాథ్ ఆస్పత్రికి తీసుకువస్తే వైద్యులు ప్రాణాలు తీశారని మృతురాలి బంధువులు ఆరోపించారు. శనివారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్నారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు...ఓడిచెరువు మండలం వణుకువారిపల్లికి చెందిన వాణిశ్రీని రెండో కాన్పు నిమిత్తం కుటుంబీకులు ఈ నెల 1వ తేదీన కదిరిలోని సాయినాథ్ ఆస్పత్రిలో చేర్చారు. అదేరోజు అర్ధరాత్రి సమయంలో కాన్పు కష్టంగా ఉందని చెప్పిన వైద్యులు.. సిజేరియన్ చేసి ఆడ శిశువును బయటకు తీశారు. ప్రసవం అయిన గంట తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ వాణిశ్రీని తక్షణం బెంగళూరుకు తీసుకెళ్లండని చెప్పి డిశ్చార్జ్ చేశారు. దీంతో కుటుంబీకులు బెంగళూరు తరలిస్తుండగా...మార్గ మధ్యంలోనే ఆమె మృతి చెందింది. శనివారం ఆస్పత్రి వద్దకు వచ్చిన మృతురాలి కుటుంబీకులు, బంధువులు... వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వాణిశ్రీ చనిపోయిందని ఆరోపించారు. కళ్లు తెరవకుండానే కన్నతల్లిని కోల్పోయిన ఆడబిడ్డకు న్యాయం చేయాలని, వైద్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వారంతా ఆసుపత్రిలోకి చొరబడటంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.
వైద్యుల నిర్లక్ష్యం లేదు
డెలివరీ అనంతరం పేషంట్ వాణిశ్రీకి ‘ఆమ్నియోటిక్ ఫ్లూడ్ ఎంబాలిజమ్’ అనే ప్రాణాంతకమైన సమస్య రావడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు రెఫర్ చేశామని, దురదృష్టవశాత్తు దారిలోనే ఆమె చనిపోయిందని సాయినాథ్ ఆసుపత్రి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం లేదని పేర్కొంది.
కదిరి సాయినాథ్ హాస్పిటల్ ఎదుట
బాధితుల ఆందోళన


