● గుడిబండలో ఖాళీ సిలిండర్లతో
మహిళల బైఠాయింపు
గుడిబండ: గ్యాస్ సిలిండర్ బుక్ చేసి వారాలు గడుస్తున్నా డెలివరీ ఇవ్వకుండా వేధిస్తున్న విష్ణుప్రియ గ్యాస్ ఏజెన్సీపై మహిళలు నిరసన వ్యక్తం చేశారు. శనివారం ఖాళీ సిలిండర్లు తీసుకువచ్చి గుడిబండ బస్టాండ్ ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. తామంతా గుడిబండలోని విష్ణుప్రియ గ్యాస్ ఏజెన్సీ నుంచి కొన్నేళ్లుగా హెచ్‌పీ గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల సిలిండర్ డెలివరీలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో సరఫరాలో ఇబ్బందులున్నాయని తాము కూడా సర్దుకున్నామన్నారు. అయితే వారం రోజుల క్రితం సిలిండర్ బుక్ చేసిన వారికి ఏజెన్సీ నిర్వాహకులు మూడు రోజుల తర్వాత టోకెన్లు ఇచ్చారని, దీంతో మరుసటి రోజు నుంచి రోజూ ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీ వరకు వెళ్లడం సాయంత్రం వరకూ ఉండి వెనక్కు రావడం జరుగుతోందన్నారు. వృద్ధులు, మహిళలు కిలోమీటర్ల మేర క్యూలో ఎండలో నిలబడినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇలా ఎన్నాళ్లని ప్రశ్నిస్తే సిలిండర్లు సరఫరా కావడం లేదని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారన్నారు. కానీ వచ్చిన సిలిండర్లను ఏజెన్సీ వారు అక్రమంగా కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని తెలిసిందన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తమకు సకాలంలో గ్యాస్ సిలిండర్లు ఇప్పించడంతో పాటు విష్ణుప్రియ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


