● ముందస్తు చర్యలు చేపట్టాలని
కలెక్టర్ ఆదేశం
ప్రశాంతి నిలయం: జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య ఉత్పన్నం కాకూడదని, అందుకోసం అన్ని మండలాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వేసవిలో ఏ గ్రామంలోనూ తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. భూగర్భ జల మట్టాన్ని పెంచేందుకు ఉపాధి హామీ పథకం కింద నిర్మిస్తున్న నీటి కుంటలు, చెక్ డ్యాంల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. నీటి సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. రోజూ నీటి సరఫరాను పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ సమత, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సుబ్బయ్య, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డ్వామా పీడీ విజయ్‌ప్రసాద్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
కోర్టు కేసుల్లో నిర్లక్ష్యం వద్దు
ప్రశాంతి నిలయం: కోర్టు కేసుల్లో కౌంటర్ దాఖలు చేయడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం పనికిరాదని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులకు సూచించారు. హైకోర్టు ధిక్కరణ కేసులు, ఇతర రిట్ పిటిషన్లపై శనివారం కలెక్టర్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... కోర్టులో ఉన్న కేసులకు సంబంధించి వెంటనే కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించారు. కాలయాపనతో కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. భూ సేకరణ, పట్టా మార్పిడి, ఇతర రెవెన్యూ సంబంధిత సమస్యలపై ఉన్న కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. కోర్టు ఇచ్చిన గడువులోపు నివేదికలు సమర్పించాలని, ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించరాదన్నారు. ఆర్డీఓలు తమ పరిధిలోని తహసీల్దార్లను నిరంతరం సమన్వయం చేసుకుంటూ కేసుల పురోగతిని పర్యవేక్షించాలన్నారు. న్యాయ పరమైన అంశాల్లో అలసత్వం వహిస్తే వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వీసీలో జేసీ మౌర్యభరద్వాజ్, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.


