గార్లదిన్నె: శ్రీరామ నవమి సందర్భంగా గార్లదిన్నె మండలం కొప్పలకొండ, పాత కల్లూరు, కల్లూరు (ఆర్‌ఎస్) గ్రామాల్లో శుక్రవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన యువకుల బలప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఆయా గ్రామాల్లో ఇసుక మూట యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 120 కిలోల ఇసుక బస్తాను స్వయంగా ఎత్తుకుని 10 నిమిషాల వ్యవధిలో ఎవరైతే ఎక్కువ దూరం వెళ్తారో వారిని విజేతలుగా ప్రకటించారు. పాత కల్లూరులో 9 మంది యువకులు పోటీల్లో పాల్గొనగా పెద్దవడుగూరు మండలం చిత్రచేడు గ్రామానికి చెందిన సుధాకర్ మొదటి స్థానం, పాత కల్లూరుకు చెందిన అక్షింతల ఆనంద్ రెండో స్థానం, పామిడి మండలం వంకరాజుకాలువ నివాసి ఎర్రిస్వామి మూడో స్థానంలో నిలిచారు. విజేతలను నగదు పురస్కారాలతో గ్రామస్తులు సత్కరించారు.
ఉత్కంఠగా ట్రాక్టర్ రివర్స్ పోటీలు
శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా పాత కల్లూరులో శుక్రవారం నిర్వహించిన ట్రాక్టర్ రివర్స్ పోటీలు ఉత్కంఠగా సాగాయి. పోటీల్లో 26 మంది యువకులు పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో పామిడికి చెందిన నరేష్ మొదటి స్థానం, వంకరాజుకాలువకు చెందిన నరేంద్ర రెండోస్థానం, గార్లదిన్నె మండలం కేశవాపురం గ్రామానికి చెందిన హరి మూడో స్థానంలో గెలుపొందారు. విజేతలను నగదు పురస్కారాలతో గ్రామస్తులు సత్కరించారు.
మేలు జాతి పశు సంతతి పెంపుపై దృష్టి
● డీఎల్‌డీఏ ఈఓ డాక్టర్ జి.వెంకటేష్
అనంతపురం అగ్రికల్చర్: లింగనిర్ధారిత వీర్యం (సెక్స్ సార్టెడ్ సెమన్–ఎస్‌ఎస్‌ఎస్) విధానాన్ని పటిష్టంగా అమలు చేసిన కారణంగా వచ్చే ఏడాది నుంచి వాటి ఫలితాలు వాస్తవ రూపం దాల్చనున్నాయని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డిస్ట్రిక్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ–డీఎల్‌డీఏ) ఈఓ డాక్టర్ జి.వెంకటేష్ తెలిపారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కుప్పం ప్రాంతంలోనూ కృత్రిమ గర్భోత్పత్తి కింద పాడి పశువులు, గేదెలకు ఎస్‌ఎస్‌ఎస్ విధానం ద్వారా ఉచితంగా ఎద సూదులు వేసినట్లు గుర్తు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 35 వేల డోసులు ఎస్‌ఎస్‌ఎస్ వీర్యం సరఫరా కాగా అందులో 20 వేలకు పైగా డోసులు పశువులు, గేదెలకు వేశామన్నారు. ఇక నుంచి ప్రతి నెలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 వేల పశువులకు ఎదసూదులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది వాటి ఫలితాలు వెల్లడవుతాయన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో మేలుజాతి పశుసంతతి, పాడి ఉత్పత్తి గణనీయంగా పెరిగే పరిస్థితి ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈనెలాఖరు నాటికి లేగదూడల ప్రదర్శన పూర్తవుతుందన్నారు. పశుశాఖ, డీఎల్‌డీఏ తరపున ఎస్‌ఎస్‌ఎస్ పథకం ప్రయోజనాలపై విస్తృతంగా అవగాహన కల్పించి ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.


