సోలార్‌లోనూ సొంత లాభం | - | Sakshi
Sakshi News home page

సోలార్‌లోనూ సొంత లాభం

Mar 27 2026 9:45 AM | Updated on Mar 27 2026 9:45 AM

చిలమత్తూరు: సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా తమ ఇళ్లకు విద్యుత్‌ వినియోగించడంతో పాటు మిగిలిన విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం సూర్య ఘర్‌’ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకం హిందూపురం నియోజకవర్గంలో వెండర్ల జేబులు నింపుతోంది. మున్సిపాలిటీలోని కీలక అధికారి ఓ వెండర్‌కు అండగా నిలిచి ప్లాంట్‌ సామగ్రి అంతా అతని వద్దే కొనాలంటూ మెలిక పెట్టారు. అంతేకాకుండా మహిళా సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి మరీ మహిళా సంఘాలను సోలార్‌ వైపు మళ్లించి ఆ వెండర్‌ ద్వారానే కొనుగోలు చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇందుకు గాను సదరు వెండర్‌ నుంచి భారీగానే దండుకుంటున్నట్లు తెలుస్తోంది.

‘మిత్ర’పై ఆ అధికారి దాతృత్వం

మున్సిపాలిటీలో పీఎం సూర్య ఘర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సామగ్రి విక్రయించే ఓ వెండర్‌కు మున్సిపాలిటీలో ముఖ్య అధికారి అండగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. మెప్మాలో అధికారులను తనదారికి తెచ్చుకొని ఆ వెండర్‌ ద్వారా ప్లాంట్‌ కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందించి మరీ ఆ వెండర్‌కు లబ్ధి చేకూరుస్తున్నారు. అందుకోసం భారీగా ముడుపులు చేరుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అధికారి తాజాగా పీఎం సూర్య ఘర్‌ ను దుర్వినియోగం పరుస్తూ ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కు కావడం సంచలనంగా మారింది.

మిగిలిన వెండర్లకు వేధింపులు

‘పీఎం సూర్య ఘర్‌’ పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుండగా చాలా మంది ఇళ్లపై సోలార్‌ పలకలు అమర్చుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో కొంతమంది చిన్న చిన్న వెండర్లు కూడా నాణ్యమైన సామగ్రి అందిస్తామంటూ ముందుకు వచ్చారు. అయితే అలాంటి వెండర్లుకు అవకాశం ఇవ్వకుండా తనకిష్టమైన వెండర్‌కు మాత్రమే మున్సిపల్‌ అధికారి అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్య సోలార్‌ రూఫ్‌టాప్‌ సామగ్రి వెండర్‌గా ఉండగా...వెండర్షిప్‌ను విత్‌డ్రా చేసుకోవాలంటూ ఆ అధికారి బలవంతం చేశారు. మాట వినలేదన్న కారణంతో సదరు ఉద్యోగిని ‘పురం’ నుంచి బయటకు పంపించివేసినట్టుగా ఆరోపణలున్నాయి.. మిగతా వెండర్ల నుంచి సామగ్రి కొనుగోలు చేస్తే సబ్సిడీ రాదంటూ అందరినీ భయపెడుతున్నారు. దీంతో చాలా మంది సదరు వెండర్‌ ఇచ్చే పరికరాలు నచ్చకపోయినా తప్పని సరి పరిస్థితుల్లో అతనివద్దే సోలార్‌ రూఫ్‌టాప్‌ సామగ్రి కొనాల్సి వస్తోంది.

పెనుకొండపై కన్ను

ఇప్పటికే హిందూపురంలో తిష్టవేసిన వెండర్‌.. తాజాగా పెనుకొండ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. మంత్రి సవిత అండదండలతో వ్యాపారం సాగించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా ఓ వెండర్‌ ఏకచక్రాధిపత్యాన్ని ఎండగట్టాల్సిన అధికారులే చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి.

‘పీఎం సూర్య ఘర్‌’ దుర్వినియోగం

హిందూపురం మున్సిపాలిటీలో ఆ అధికారే ‘మిత్ర’కు అండ

ఒక్క వెండర్‌ నుంచే సామగ్రి కొనుగోలు చేయాలంటూ హుకుం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement