ఉరవకొండ రూరల్: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ మహిళా కూలీ దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు... కణేకల్లు మండలం హనకనహాళ్ గ్రామానికి చెందిన కూలీలు గురువారం ఉదయం ఉరవకొండ మండలం నెరిమెట్ల గ్రామంలో మిరప పంట కోతకు ఆటోలో బయలుదేరారు. నింబగల్లు గ్రామ సమీపంలోకి చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో హనకనహాళ్‌కు చెందిన మహిళా కూలీ హసీనా (45) అక్కడికక్కడే మృతి చెందింది. రామలక్ష్మి, వరలక్ష్మి, పద్మ, లక్ష్మి, నిర్మలకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళుతున్న వారు గుర్తించి క్షతగాత్రులను వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


