అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక సాయిబాబా జాతీయ డిగ్రీ కళాశాల (అటానమస్) యూజీ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ (రెగ్యులర్, సప్లిమెంటరీ) పరీక్షా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఎవాల్యూయేషన్ విడివిజన్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.వెంకటరమణ, కె.శ్రీరాములు నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కళాశాల కరస్పాండెంట్, సెక్రటరీ, పాలకవర్గ సభ్యులు, ప్రిన్సిపాల్, స్టూడెంట్ ఎవాల్యూషన్ డివిజన్ సిబ్బంది, బోధన సిబ్బంది పాల్గొన్నారు. ఫలితాలను www. ssbnc. in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సరిత తెలిపారు.
‘పురం’ మార్కెట్‌కు 3,200 క్వింటాళ్ల చింతపండు
హిందూపురం: స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు గురువారం 3,200 క్వింటాళ్ల చింత పండును విక్రయానికి రైతులు తీసుకువచ్చారు. మొదటి రకం కరిపులి క్వింటా గరిష్టంగా రూ.27వేలు, కనిష్టంగా రూ.10,100తో సగటున రూ.14,500తో అమ్ముడు పోయింది. అలాగే రెండో రకం ఫ్లవర్ క్వింటా గరిష్టంగా రూ.14 వేలు, కనిష్టంగా రూ.6,100తో సగటున రూ.9 వేలతో క్రయవిక్రయాలు సాగాయి. ప్రతి సోమ, గురువారాల్లో చింతపండు, మంగళ, శుక్రవారాల్లో ఎండుమిర్చి క్రయవిక్రయాలు చేపట్టనున్నట్లు మార్కెట్ కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు.
గుత్తిలో వరుస చోరీలు
గుత్తి: స్థానిక తాడిపత్రి మార్గంలోని మూడు దుకాణాల్లో గురువారం తెల్లవారు జామున దొంగలు పడ్డారు. మురళీకృష్ణ జనరల్ స్టోర్స్, గంగాగౌరీ ట్రేడర్స్, శ్రీలక్ష్మీ ఎంటర్ ప్రైజెస్ దుకాణాల్లో చొరబడిన దుండగులు కొంత నగదు, విలువైన సామగ్రిని అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఆర్‌ఓ ప్లాంట్ల నిర్వహణ లేకనే సమస్య
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ ప్లాంట్ల నిర్వహణ సరిగా లేకనే సమస్య తలెత్తి తాగునీటికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సమగ్ర శిక్ష ఏపీసీ టీ.శైలజ పేర్కొన్నారు. ఆర్‌ఓ ప్లాంట్ల నిర్వహణపై అనంతపురం జిల్లాలోని 107 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు గురువారం స్థానిక సైన్స్ సెంటర్‌లో ఓరియెంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఆర్‌ఓ ప్లాంట్లు సరఫరా చేసిన ఆహ్లాద కంపెనీ, ఇన్నోవేటివ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొని డెమో ద్వారా ప్లాంట్ల నిర్వహణ, వినియోగ విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏపీసీ మాట్లాడారు. చిన్నపాటి సమస్యలను సైతం పరిష్కరించకుండా అలాగే వదిలేస్తుండడంతో అవి పెద్ద సమస్యగా మారుతున్నాయన్నారు. సమస్యలు నెలకొన్న పాఠశాలల వివరాలు తెలియజేస్తే కంపెనీలతో చర్చించి పరిష్కారం చూపిస్తామన్నారు. ఇంజనీర్ రమణారెడ్డి మాట్లాడుతూ.. నీటి కొరత, పైప్‌లైన్ లేకపోవడం, విద్యుత్ సమస్యలు వంటి అంశాలను తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. అసిస్టెంట్ ఏఎంఓ నారాయణస్వామి మాట్లాడుతూ.. జిల్లాలో ఆర్‌ఓ ప్లాంట్లు సరఫరా చేసిన ప్రతి కంపెనీతో కలిసి పాఠశాల స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఏపీఓ నారాయణస్వామి మాట్లాడుతూ.. చిన్న పాటి సమస్యలను పాఠశాల స్థాయిలోనే పరిష్కరించుకోవాలని, పెద్ద సమస్యలను సమగ్ర శిక్ష ద్వారా పరిష్కరిస్తామని సూచించారు.


