సర్కారుపై టీచర్ల పోరుబాట
పుట్టపర్తి అర్బన్: ఎన్నికల వేళ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ చంద్రబాబు సర్కార్‌పై రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) పోరుబాట పట్టింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేసింది. పీఆర్సీ కమిటీ, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఎస్టీయూ నేతలు శుక్రవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. అనంతరం ఎస్టీయూ నాయకులు కలెక్టరేట్ వరకూ ర్యాలీగా వెళ్లి కలెక్టర్ శ్యాం ప్రసాద్‌కు డిమాండ్లతో కూడిన వినతి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గజ్జల హరి ప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానుజులు యాదవ్ మాట్లాడుతూ... ఎన్నికల వేళ ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి నాయకులు అలవిగాని హామీలిచ్చారన్నారు. మెరుగైన పీఆర్సీ ప్రకటిస్తామని, పీఆర్సీ ఆలస్యమైతే అధికారం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని, సమయానుకూలంగా డీఏలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని, మెరుగైన పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారన్నారు. అలాగే పెండింగ్ బకాయిలను విడతల వారీగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు 57 మెమో అమలు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని హామీలిచ్చారన్నారు. అయితే అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా నేటికీ ఒక్క హామీని అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. 11వ పీఆర్సీ గడువు 2023 జూలైతో ముగిసి రెండు సంవత్సరాల 8 నెలలు అవుతోందన్నారు. పీఆర్సీ అమలు చేయకపోవడంతో ప్రతి ఉద్యోగికీ నెలనెలా వేలాది రూపాయలు నష్టం వాటిల్లుతోందన్నారు. మధ్యంతర భృతి మంజూరుకు చర్యలు లేకపోవడం దుర్మార్గమన్నారు. 11వ పీఆర్సీ, డీఏ, సరెండర్ లీవులు, పీఎఫ్, మెడికల్ బిల్లులు సుమారు రూ.30 వేల కోట్ల వరకూ పేరుకుపోయాయన్నారు. అలాగే సీపీఎస్, జీపీఎస్‌ను రద్దు చేసి మెరుగైన పెన్షన్ విధానాన్ని తీసుకు వస్తామని తమను ఆశ పెట్టి ఓట్లు వేయించుకున్న కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక తమ సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్లు జవహర్, రామ్మోహన్, రవీంద్రనాథ్, సుధాకర్, జిల్లా ఆర్థిక కార్యదర్శి జయకృష్ణ, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు లక్ష్మీప్రసాద్, జాఫర్ హుస్సేన్, సంపత్‌కుమార్, రవిచంద్ర, వెంగమనాయుడు, జిల్లా కార్యదర్శి ప్రసాద్, రాష్ట్ర ఆర్థిక కమిటీ మాజీ సభ్యులు బీఎన్ ప్రసాద్, వేణుగోపాల్, ధనుంజయ రెడ్డి, గంగాధర్ యాదవ్, యోగేంద్ర, రాము, ముద్దుకృష్ణ, సురేష్, నరహరి, ప్రమిద, సునీత తదితరులు పాల్గొన్నారు.
హామీలు అమలు చేయాలని
రిలే నిరాహార దీక్షలు
పీఆర్సీ కమిటీ నియామకం, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్
కలెక్టర్‌కు వినతి పత్రం అందజేత
సర్కారుపై టీచర్ల పోరుబాట


