వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీ నేత దాడి
కనగానపల్లి: మండలంలోని వేపకుంట గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త దివిటి రమణపై స్థానిక టీడీపీ నాయకుడు చండ్రాయుడు దౌర్జన్యానికి తెగబడ్డాడు. బాధితుడు రమణ తెలిపిన మేరకు... గ్రామంలోని టీడీపీ నాయకుడు చండ్రాయుడు, రమణకు పక్కపక్కనే పొలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు పొలాల గట్లకు అనుకుని గాలిమరల స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే కేవలం చండ్రాయుడుకు మాత్రమే పరిహారం మంజూరు కావడంతో తన పొలానికి ఆనుకుని స్తంభాలు ఏర్పాటు చేయకూడదని సోమవారం పొలం వద్ద పనులను రమణ అడ్డుకున్నాడు. విషయం తెలుసుకున్న చండ్రాయుడు అక్కడకు చేరుకుని దాడిచేయడంతో రమణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఈ విషయంపై సాయంత్రం ఇరువర్గాలు ఫిర్యాదు చేయడంతో టీడీపీ నేత ఫిర్యాదును మాత్రమే పోలీసులు స్వీకరించి, తన ఫిర్యాదును తిరస్కరించారని బాధితుడు వాపోయాడు.


