హెలిప్యాడ్ ఏర్పాటుకు స్థల పరిశీలన
మడకశిర రూరల్: జిల్లాలో విలువైన ఖనిజ సంపదను గుర్తించేందుకు వీలుగా చేపట్టనున్న టైమ్ డొమైన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ (టీడీఈఎం) సర్వేకు సంబంధించి హెలికాఫ్టర్ టేకాఫ్, రాత్రి పార్కింగ్‌కు అనువైన స్థలం కోసం మడకశిర మండలం కల్లుమర్రిలోని జెడ్పీహెచ్‌ఎస్ క్రీడా మైదానాన్ని అధికారులు సోమవారం పరిశీలించారు. ఈ నెల 20 నుంచి 2026, మే 31 వరకు ఈ సర్వేను భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఔట్‌సోర్స్ ఏజెన్సీ ద్వారా హెలిబోర్న్ సర్వే చేపట్టనున్నారు. స్థల సరిశీలనలో తహసీల్ధార్ కల్యాణ చక్రవర్తి, ఆర్‌అండ్‌బీ డీఈ లక్ష్మీనారాయణ, రెవెన్యూ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
జనవరి ఒకటి నుంచి రైళ్ల రాకపోకల్లో మార్పు
అనంతపురం సిటీ: అనంతపురం మీదుగా సంచరించే పలు రైళ్ల రాకపోకల వేళలు జనవరి ఒకటి నుంచి మారనున్నాయి. ఈ మేరకు అనంతపురం స్టేషన్ మేనేజర్ అశోక్‌కుమార్ సోమవారం రాత్రి వెల్లడించారు. కర్ణాటకలోని కలబురిగి నుంచి బెంగళూరుకు వెళ్లే రైలు (22231) ఇక నుంచి శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు అనంతపురానికి ఉదయం 10.03 గంటలకు అనంతపురానికి చేరుకుని 10.05 గంటలకు బయలుదేరుతుంది. బెంగళూరు నుంచి కలబురిగి వెళ్లే ఎక్స్‌ప్రెస్ (22232) అనంతపురానికి 5.33కు వచ్చి 5.35 గంటలకు బయలుదేరుతుంది. ఽయశ్వంత్‌పూర్–మచిలీపట్నం మధ్య నడిచే రైలు (17212) అనంతపురానికి సాయంత్రం 4.33 గంటలకు వచ్చి 4.44 గంటలకు బయలుదేరుతుంది. బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18464) సాయంత్రం 6.28 గంటలకు అనంతపురానికి వచ్చి 6.30 గంటలకు వెళ్లిపోతుంది.
శబరిమలకు ప్రత్యేక రైళ్లు..
శబరిమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం జనవరి 10, 17 తేదీల్లో చర్లపల్లి నుంచి కొల్లం బయలుదేరే రైలు (07127) అనంతపురానికి ఆయా తేదీల్లో సాయంత్రం 7.53 గంటలకు వచ్చి 7.55 గంటలకు వెళ్లిపోతాయి. ఈ రెండు రైళ్లు అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి, పాకాల, కాట్పాడి మీదుగా కొల్లం జంక్షన్‌కు చేరుకుంటాయి.


