అయ్యో ‘పాప’ం
ముక్కుపచ్చలారలేదు.. ముచ్చటగా మూడు నెలలైనా నిండనూ లేదు..అమ్మ ఒడిలో అల్లారు ముద్దుగా ఒదగాల్సిన పసి గుడ్డు.. ఆలనాపాలనకు నోచుకోలేదు.. ఆతల్లికి ఏమైందో.. ఆడ పిల్లనుకుందో...అప్పుడే భారమైందో.. ఏమైందో.. తొమ్మిదినెలలు మోసి..పురిటినొప్పులు భరించి.. ప్రసవ వేదన అనుభవించి..పాలిచ్చి.. లాలించాల్సిన అమ్మ మనస్సు కఠినమైందో.....అరిష్టమనుకున్నారో..అత్తింటి ఆరళ్లు పొత్తిళ్ల నుంచి విడదీశాయో.. తప్పెవరిదని.. ప్రశ్నించలేని తనం.. నేనేంచేశానని నిలదీయలేని హృదయం.. నేనెవరినని చెప్పుకోలేక..నన్నెందుకు వదిలేస్తున్నారని నిలదీయలేక..ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో.. ముళ్లపొదలే ఇళ్లయిన వేళ.. గుక్కపెట్టి ఏడిస్తుంటే.. అటుగా వెళ్లేవారు చూసి అయ్యో‘పాప’ం..అన్నారు.. అక్కున చేర్చుకున్నారు.. ఈహృదయవిదారక ఘటన కదిరి మండలం కాళసముద్రం ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వద్ద మంగళవారం సాయంత్రం వెలుగుచూసింది.
కదిరి అర్బన్: ముళ్లపొదల్లో పడి ఉన్న పసిపాప అరుపులు విని గొర్రెల కాపరులు దగ్గరకు వెళ్లారు. సమాచారాన్ని రూరల్ మండల పోలీసులకు అందించారు. రూరల్ అప్‌గ్రేడ్ పోలీస్టేషన్ సీఐ నిరంజన్‌రెడ్డి స్థానిక అంగన్‌వాడీ సిబ్బంది సహాయంతో చిన్నారని కదిరి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. పాప ఆరోగ్యంగానే ఉందని, జిల్లా కేంద్రంలోని శిశుసదన్‌కు తరలించనున్నట్లు సీఐ తెలిపారు. పాప ఎడమ చేతికి వేలు లేకుండా పుట్టింది. కాగా, పాప తల్లిదండ్రులు ఎవరు, ఇక్కడ ఎందుకు వదిలేశారనే విషయం పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది.


